/rtv/media/media_files/2026/01/13/raja-saab-2026-01-13-20-51-03.jpg)
Raja Saab
Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో సినిమా మంచి టాక్‌తో కొనసాగుతుండటంతో చిత్ర బృందం సంతోషంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు మారుతి(Director Maruthi) ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపించారని అభిమానులు, సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి, ‘రాజా సాబ్’ సినిమా తనకు ఏం నేర్పిందో, ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాల్ని ఓపెన్‌గా పంచుకున్నారు.
మారుతి మాట్లాడుతూ.. “ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద నెంబర్లు సాధించాలంటే ప్రేక్షకులకు అది నిజంగా నచ్చాలి. ‘రాజా సాబ్’ విషయంలో అదే జరిగింది. ఆడియన్స్ సినిమా ఎంజాయ్ చేశారు కాబట్టే ఈ స్థాయిలో ఆదరణ వస్తోంది” అన్నారు. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాన్ని చంపడం పెద్ద విషయం కాదని, ఎలాగైనా చూపించవచ్చని చెప్పారు. కానీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఒక సాదా సీదా హారర్ కామెడీ చేయడం తనకు ఇష్టం లేకపోయిందని తెలిపారు. అందుకే ఈ సినిమాలో ఫాంటసీ, సైకాలజీ అంశాలను జోడించి, పెద్ద స్థాయిలో సినిమా రూపొందించామని చెప్పారు.
‘రాజా సాబ్’లాంటి సినిమా చేయడం అంత సులువు కాదని మారుతి స్పష్టం చేశారు. ఒక మనిషి ట్రాన్స్‌లోకి వెళ్లిన పరిస్థితిని విజువల్‌గా చూపించడం చాలా కష్టమని, అతని మనసులో జరుగుతున్న భావాలను తెరపై చూపించడానికి చాలా ఆలోచన చేయాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా సబ్ కాన్షియస్ మైండ్‌ను ప్రెజెంట్ చేయడం పెద్ద ఛాలెంజ్‌గా మారిందన్నారు. అలాగే ప్రభాస్ ఓల్డ్ గెటప్‌కు సంబంధించిన రివర్స్ సీన్స్ కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడ్డామని వెల్లడించారు.
ఈ సినిమాతో తాను ఒక పెద్ద స్టార్‌తో కూడా మంచి సినిమా చేయగలనని తనకు తానే ప్రూవ్ చేసుకున్నానని మారుతి అన్నారు. సీజీ వర్క్ విషయంలో కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. “ప్రతిరోజు పండగే” సినిమా స్క్రిప్ట్‌ను కేవలం 40 రోజుల్లో రాసిన నేను, ‘రాజా సాబ్’లో కొన్ని సీన్స్ కోసం రెండు నెలలు టైమ్ తీసుకున్నాను. అంతగా ఈ సినిమా నాకు ఓ కొత్త అనుభవం ఇచ్చింది” అని చెప్పారు.
ఇక ప్రభాస్ అభిమానుల గురించి మాట్లాడిన మారుతి, “వాళ్లు నాకు అభిమానులు కాదు, నా సోదరులు. సినిమా రిలీజ్ తర్వాత ఫోన్లు, మెసేజ్‌లు చేసి అభినందిస్తున్నారు. ప్రభాస్‌ను కొత్తగా చూపించావని చెబుతున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది వ్యక్తిగతంగా విష్ చేశారని తెలిపారు. నాగ్ అశ్విన్, సందీప్ వంగా లాంటి దర్శకులు కూడా ‘రాజా సాబ్’కి సపోర్ట్ చేశారని చెప్పారు.
మొత్తానికి ‘రాజా సాబ్’ సినిమా మారుతికి ఒక పెద్ద లెర్నింగ్ అనుభవంగా నిలిచిందని, భవిష్యత్తులో మరింత కొత్తగా, పెద్ద సినిమాలు చేయడానికి ఇది తనకు ధైర్యం ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
Follow Us