/rtv/media/media_files/2025/11/20/pratyusha-2025-11-20-07-13-32.jpg)
తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి, నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తమ తీర్పును రిజర్వ్ చేసింది.
ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నప్పుడు ఇద్దరు ప్రేమలో పడ్డారు.అయితే ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా... సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో కనిపించారు. వెంటనే వారిరి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రత్యూష చికిత్స పొందుతూ 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి బ్రతికి ప్రాణాలతో బయటపడి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లుగా ల్యాబ్ రిపోర్ట్ లో తేలింది.
ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష చనిపోయారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు, ఆత్మహత్యాయత్నం చేసుకున్నందుకు సిద్ధార్థ్ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్షను హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విధించారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా... జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలైన ఈ రెండు క్రిమినల్ అప్పీళ్లపైనే విచారణ పూర్తై, తాజాగా తీర్పు రిజర్వ్ చేయబడింది.
మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగుమందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని సిద్ధార్థరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, ఎల్.నరసింహారెడ్డి కోర్టులో తమ వాదనలు వినిపించారు. కాగా తమ పెళ్లి ప్రతిపాదనను సిద్ధార్థ్ రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో, మనస్తాపం చెంది ఇద్దరూ కలిసి కూల్ డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రాథమికంగా పోలీసులు, సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు. ఈ కేసు ఆత్మహత్యగా నమోదు అయినప్పటికీ, ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మొదటి నుండి దీనిని హత్య అని వాదిస్తూ వచ్చారు.
Follow Us