రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘కూలీ’ భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.350 నుంచి రూ.375 కోట్లతో ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో రజినీ కాంత్‌తో పాటు మరెందరో స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేశారు. ‘చికిటు’ (Chikitu) అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. తెలుగులో శ్రీనివాస మౌళి ఈ పాటను రాయగా.. టి. రాజేందర్, అనిరుధ్, అరివు పాడారు. ఇందులో రజినీకాంత్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశాడు.
Coolie movie Chikitu Video Song
ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున ఇందులో సైమన్ అనే విలన్ పాత్రలో నటించారు. అలాగే ఉపేంద్ర.. కాళేశ్ పాత్రలో, సౌబిన్ షాహిర్.. దయాల్ పాత్రలో, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే, శృతి హాసన్ వంటి నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇలా ఎంతో మంది పవర్ ఫుల్ యాక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది.
ఇందులో రజినీకాంత్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ హైక్లాస్‌గా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే టాక్ నడిచింది. ఈ మూవీ ప్రేక్షకులకు అయితే పెద్దగా ఎక్కలేదని చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉన్నాయని, కొన్ని సన్నివేశాలు పాతకాలం నాటివిగా ఉన్నాయని విమర్శలు కూడా వచ్చాయి.
అలాగే రజనీకాంత్, నాగార్జున వంటి స్టార్స్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికొస్తే.. విడుదలైన 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.511.5 కోట్లు వసూలు చేసినట్లుగా అంచనాలు ఉన్నాయి. అందులో భారతదేశంలో రూ.334.7 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.176.8 కోట్లు వసూలు చేసినట్లు టాక్ నడిచింది.
కాగా ఈ 'కూలీ' సినిమా కథ మాజీ కూలీ యూనియన్ లీడర్ అయిన దేవా చుట్టూ తిరుగుతుంది. అతను విద్యార్థుల కోసం రాయితీ గృహాలను నిర్వహిస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. అయితే, అతని స్నేహితుడు రాజశేఖర్ మరణం అతని జీవితంలో కలకలం సృష్టిస్తుంది. రాజశేఖర్ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో, దేవా ఒక ప్రమాదకరమైన గ్యాంగ్ లీడర్ అయిన సైమన్, ఒక చీకటి రహస్యాన్ని దాచిపెట్టిన దయాల్‌తో తలపడతాడు.