71th National Film Award: ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు.. అబ్బా ఇది కేవలం ఒక పాట కాదు, పల్లె జీవితానికి ప్రాణం పోసినట్లు ఉంటుంది. ఈ పాటలోని ప్రతీ లిరిక్ ఎంతో సహజత్వం, పల్లె ప్రకృతితో నిండి.. విన్న ప్రతి ఒక్కరికి తమ సొంత పల్లెను, అక్కడి బంధాలను గుర్తుచేస్తుంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి జాలువారిన ఈ పాటకు ఇప్పుడు జాతీయ స్థాయి పురష్కారం దక్కింది. తాజాగా ప్రకటించిన 71th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో 'ఊరు పల్లెటూరు' పాటకు గానూ కాసర్ల శ్యామ్ కి ఉత్తమ లిరిసిస్ట్ అవార్డు వరించింది. సంగీతం, సాహిత్యం, గానం కలగలిపిన ఈ పాట 'బలగం' సినిమాను పల్లె ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమాకు ఒక మైలురాయిగా నిలిచింది. 2023లో విడుదలైన 'బలగం' సినిమా తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి వీధిలో దీనిని ప్రదర్శించారు. ఇది కేవలం ఒక సినిమా కాదు తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు, మనుషుల మధ్య ఆత్మీయత, బలహీనపడుతున్న బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ!
Proud moment for Telugu cinema!@LyricsShyam wins Best Lyricist at the 71st National Film Awards for the soul-stirring #OoruPalletooru from #Balagam
— Dil Raju Productions (@DilRajuProdctns) August 1, 2025
ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు
A song that echoed the heartbeat of the land,… pic.twitter.com/CYZT7iXOyV
లిరిక్స్ ఇవే..
ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు
ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా
నీ పాసుగాల
కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే
రామ రామ రామ
తలకు పోసుకుందె నా నేల తల్లే
అలికి పూసుకుందె ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే
హే తెల్ల తెల్లాని పాలధార ఓలే
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే
జంటగ మోగుత ఉంటయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సెల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల చప్పట్లు
గడ్డి మోపులు కాల్వ గట్టులు
సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల
ఊరు పల్లెటూరు
దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు
దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు
వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే
ఆలు మొగలు ఆడే ఆటలు
అత్త కోడండ్ల కొట్లాటలు
సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు
రచ్చబండ మీద ఆటలు
చాయబండి కాడ మాటలు
వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే
సంగతే గమ్మతి
తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది
ఊరు నా ఊరు
దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు
దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు
వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే
Also Read: 71th National Film Awards-2023: భగవంత్ కేసరి, బలగం సినిమాలకు నేషనల్ అవార్డ్స్! ఫుల్ లిస్ట్ ఇదే