KTR : రేవంత్ రెడ్డికి సినిమా చూపిస్తామంటున్న కేటీఆర్

ప్రస్తుతం చూస్తున్నది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా స్టార్ట్ అవుతే రేవంత్ రెడ్డికి నిద్రపట్టదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ కామెంట్స్ చేశారు.

New Update

కాంగ్రెస్‌ సర్కార్‌కు అల్రెడీ సినిమా స్టార్ట్‌ అయిందని, అసలైన సినిమా స్టార్ట్‌ అయితే రేవంత్‌కు నిద్రపట్టదని బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR)సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్న పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో భాగంగా శుక్రవారం భువనగిరి (Bhuvanagiri) నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అభివృద్ధి కండ్లముందు కనిపిస్తుంటే కాంగ్రెస్‌ మాత్రం కేసీఆర్‌పై దుష్ఫప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రస్తుతం ట్రైలర్‌ మాత్రమే మొదలైందని, అసలు సినిమా ఫిబ్రవరిలో మొదలవుతుందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ జనంలోకి రాగానే సినిమా స్టార్ట్‌ అవుతుందని, సినిమా స్టార్ట్‌ అయిందంటే రేవంత్‌కు నిద్రపట్టదన్నారు.

ఇది  కూడా చదవండి: Kanak Bhawan : సీతకు అత్త కైకేయి బహుమతిగా ఇచ్చిన భవనం ఎక్కడుందంటే..?

ఫిబ్రవరి నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) జనంలోకి వస్తారని, వచ్చాక సినిమా స్టార్ట్‌ చేస్తామని, కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు దుష్ఫప్రచారం చేస్తామంటే ఊర్కునేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. నెల రోజుల పాలనలోనే కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రజావ్యతిరేకత మొదలైందని కేటీఆర్‌ తెలిపారు. ఇంత తక్కువ సమయంలోనే ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని, అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కిందని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో గవర్నర్‌ చేత కాంగ్రెస్‌ పార్టీ కరపత్రాన్ని చదివించారని, కేసీఆర్‌ పై ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారం చేయించారని కేటీఆర్‌ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో అనేకం అమలు చేశామన్నారు. నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్‌ సమస్య తీర్చిది నిజం కాదా? ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చింది నిజం కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. చేసిన అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నా కండ్లులేని కబోదిలా వ్యవహారిస్తుందని కేటీఆర్ విమర్శించారు.

ఐదేళ్లపాటు కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీల పుస్తకాన్ని కార్యకర్తలందరూ పవిత్ర గ్రంథంగా చదివి గుర్తు పెట్టుకోవాలని, వాటిని అమలు చేసేంతవరకు వదలిపెట్టవద్దని అన్నారు. నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని, వాటిని ఎక్కడికక్కడ ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో ఎదురుదెబ్బలు, గెలుపు ఓటములు సహజం. ఈరోజు మనం ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో కేసీఆర్  ప్రజాక్షేత్రంలోకి వస్తారని, ఆయన రాగానే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని కేటీఆర్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు