పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సినిమాల్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తూ.. ప్రచార కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ అన్నయ్య, సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి మద్దతుగా ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో షేర్ చేసాడు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి చిరు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
సినిమాల్లోకి కష్టంగా.. రాజకీయాల్లోకి ఇష్టంగా
వీడియోలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.." కొణిదెల పవన్ కల్యాణ్… అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా… అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు.
కానీ కల్యాణ్… తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం… ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది. సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు.
ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది అంటూ ఆ వీడియో లో పేర్కొన్నాడు. చిరు చెప్పినదాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కి అసలు సినిమాలంటేనే ఆసక్తి లేదని, రాజీకీయాయాల్లోకి మాత్రం ఎంతో ఇష్టంగా వచ్చినట్లు స్పష్టం అవుతుంది. తనకు సినిమాలంటే ఆసక్తి లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలాసార్లు చెప్పాడు. కేవలం తన వదినమ్మ బలవంతం వల్లే సినిమాల్లోకి వచ్చానని అన్నాడు.