Chandrababu To Delhi: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28 న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా సవరణలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన పరిణామాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
విశాఖ పట్నం జిల్లా ఉరవకొండ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ కూడా ఓట్లు తొలగించారని ఆయన సీఈసీ (CEC -Chief Election Commissioner) దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
వైసీపీ(YCP)కి వ్యతిరేకంగా, టీడీపీ(TDP)కి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను మాత్రమే ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు ఏం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి కేంద్ర ఎన్నికల అధికారులు ముందు ఆయన ప్రస్తావించనున్నారు. ఓట్లు జాబితా నుంచి తీసివేసిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరనున్నారు. ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే పోలింగ్ బూత్ పరిధిలోనే ఉండాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తుంది.
కావాలనే ఒక కుటుంబంలోని వ్యక్తులను అనేక చోట్లకు మారుస్తున్నారని టీడీపీ పేర్కొంటోంది. పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను, దొంగ అడ్రస్ లను, ఇప్పటికే ఓటర్ల జాబితా లో చేర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు రాష్ట్రస్థాయిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే ఈ నెల 28 న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన జ్ఙాపకార్థం ప్రత్యేక నాణేలను విడుదల చేయనున్నారు. ఆ కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. అదే రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆయన కలిసే అవకాశం ఉంది అంటున్నారు. అందుకు అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.
Also Read: ఏపీ సీఎంకి ఎంఆర్ఐ స్కానింగ్!