Chandrababu Updates: ఉద్వేగం..ఉద్విగ్నం.. ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. ! వీడియో!

దాదాపు 15 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు హారతి పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు ఆయన సతీమణి భువనేశ్వరి. నిన్న సాయంత్రం 4:15గంటలకు రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు చంద్రబాబు. అక్కడ నుంచి నివాసానికి చేరుకునేవరకు దారిపొడువునా కార్యకర్తలు కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మరథం పట్టారు. ఏపీ స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

New Update
Chandrababu Updates: ఉద్వేగం..ఉద్విగ్నం.. ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. ! వీడియో!

తెలుగుదేశం కార్యకర్తలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతున్నారు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో స్కామ్‌ కేసులో నిందితుడిగా ఎప్పుడూ కూడా జైలు జీవితం గడపని చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు(Chandrababu naidu)కు బయటకు ఎప్పుడు వస్తారా.. బెయిల్ ఎప్పుడు లభిస్తుందంటూ కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా టీడీపీ అధినేతకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. నిన్న సాయంత్రం రాజమండ్రి సెంట్రల్‌ జైలు(Rajahmundry Central Prison) నుంచి చంద్రబాబు రిలీజైన దగ్గర నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసానికి చంద్రబాబు చేరుకునే వారు దారి పొడుగునా చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు నీరాజనం పలికారు.

publive-image

హారతి పట్టిన భువనేశ్వరి:
సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. దాదాపు 14:30 గంటల నిర్విరామ ప్రయాణం తర్వాత ఇవాళ(నవంబర్‌ 1) ఉదయం 5.45గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. సుదీర్ఘ ప్రయాణంతో టీడీపీ అధినేత అలసిపోయినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు హారతి పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు సతీమణి భువనేశ్వరి. అటు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్వేగానికి గురయ్యారు. 'జై చంద్రబాబునాయుడు, లాంగ్ లివ్ చంద్రన్న' అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ఇంటివద్దకు అమరావతి రైతులు, మహిళలు భారీగా చేరుకున్నారు. ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయలతో దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పట్టారు అమరావతి మహిళలు. చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికారు.

పోటెత్తిన జనం:
రాజమండ్రి జైలు నుంచి నిన్న సాయంత్రం 4:15గంటలకు బయలుదేరారు చంద్రబాబు. అక్కడ నుంచి ఉండవల్లి నివాసానికి వచ్చేవరకు కార్యకర్తలు కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మరథం పట్టారు. అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో అభిమానులు రోడ్ల వెంట పోటెత్తారు. చంద్రబాబుకు బెయిల్ లభించడంతో రాష్ట్రావ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. గన్నవరం మండలం కేసరపల్లిలో టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. మరోవైపు చంద్రబాబుకు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబునాయుడు కాన్వాయ్ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో విజయవాడ వన్ టౌన్ వినాయకుడి గుడి సెంటర్‌కు చేరుకోగానే కాన్వాయ్‌కి ఎదురుగా వెళ్లి జనసైనికులు స్వాగతం పలికారు. విజయవాడ పశ్చిమ జనసేన ఇంచార్జ్ పోతిన మహేశ్‌ నేతృత్వంలో పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కి ఎదురేగి స్వాగతించారు. చంద్రబాబుకు మద్దతుగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఏపీ స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

Also Read: హైదరాబాద్‌కు చంద్రబాబు.. కారణం వెల్లడించిన అచ్చెన్నాయుడు..

Advertisment
తాజా కథనాలు