Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ (Champai Soren)బుధవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. రాజీనామా అనంతరం చంపై రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ఆయన వెంట జేఎంఎం నేతృత్వంలోని కూటమి నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రమాణస్వీకారం చేయనున్నారు.
భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తర్వాత చంపాయ్ సీఎం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే జూన్ 28న భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున చంపై సోరెన్ నివాసంలో జరిగిన సమావేశంలో హేమంత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ తిరిగి రావాలనే నిర్ణయానికి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మద్దతు లభించింది. చంపై సోరెన్ స్థానంలో హేమంత్ సోరెన్‌ని నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.