కాళేశ్వరం ప్రాజెక్టులోకి ముఖ్య భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (Medigadda) పిల్లర్లు కుంగడంతో ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) డ్యామ్ భద్రతపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. బ్యారేజీ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో కోరారు. కిషన్ రెడ్డి లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఆయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బృందం ఈరోజు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది.
ఇది కూడా చదవండి: Medigadda Barrage Updates: మేడిగడ్డ కూలిపోతుందా?.. అసలేం జరుగుతోందంటే?
రేపు కాళేశ్వరం డ్యామ్ ను బృందం సభ్యులు పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద 6వ బ్లాక్‌లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్దగా శబ్ధాలు వచ్చినట్లు స్థానికులు చెప్పారన్నారు. దీంతో బ్యారేజ్ లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేశారని.. దీంతో సాగునీటి కోసం నిల్వ చేసిన నీరు కిందికి వదలాల్సి వచ్చిందన్నారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంగా భయంభయంగా గడిపారన్నారు.
బ్యారేజీ భద్రతపై ప్రశ్నలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రబృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించాలని లేఖలో కోరారు కిషన్ రెడ్డి. ఈ తాజా పరిస్థితికి ఎవరు బాధ్యులనే విషయాన్ని తేల్చాలన్నారు. గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు’లో భాగంగా.. ‘కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ’.. నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికితీయాలని కోరారు.