Central Cabinet Meet: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ బీజేపీ సర్కార్(BJP Sarkar) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంది. టార్గెట్ 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే వార్తను చెప్పింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 గా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా రూ.300 తగ్గి రూ. 655కే లభిస్తోంది.
ముడి జనపనార మద్దతూ ధర పెంపు..
ప్రధాని మోడీ(PM Modi) అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముడి జనపనార మద్దతు ధర పెంచింది. 2024-25 సీజన్‌లో ముడి జనపనారకు కనీస మద్దతు ధర(MSP) క్వింటాల్‌కు రూ. 5,335 గా పేర్కొంది, గత సీజన్‌తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 285 పెంచమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
AI పై స్పెషల్ ఫోకస్..
ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) పై భారత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో సమగ్ర జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది మోడీ సర్కార్(Modi Sarkar). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4శాతం డీఏ పెంచింది. ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ 2024 జనవరి నుంచి వర్తిస్తుందని తెలిపింది.
భారత సైన్యానికి మరింత బలం..
భారత సైన్యానికి మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డు కోసం 34 కొత్త ధృవ్ హెలీకాఫ్టర్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇండియన్ ఆర్మీకి 25, ఇండియాన్ కోస్టల్ గార్డుకు 9 హెలికాఫ్టర్లు కేటాయించనుంది.
ఈశాన్య ప్రాంతాలకు పెద్ద పీట..
అభివృద్ధి వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు రూ.10,037 కోట్ల పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.