టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో పెద్ద ఎత్తున కార్లలో ఐటీ ఉద్యోగులు బయల్దేరారు. ఆదివారం (సెప్టెంబర్ తెల్లవారుజామున 3 గంటలకు పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్, ఎల్బీనగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ర్యాలీగా వెళ్లారు. వీరంతా రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించి సంఘీభావం తెలపనున్నారు ఐటీ ఉద్యోగులు.
ర్యాలీకి అనుమతులు లేదు
అయితే ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాటాటా నిన్ననే ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ- ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులు.
This browser does not support the video element.
క్షుణ్ణంగా తనిఖీ
పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి సమీపంలో ఏపీ-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్నీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి అనుమంచిపల్లి కోల్డ్ స్టోరేజ్, బోర్డర్ చెక్‌పోస్టు దగ్గర జగ్గయ్యపేట సీఐ జానకిరామ్ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు.
144 సెక్షన్ అమలు
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలోని రాజుపేట వద్ద ఆంధ్ర- తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. తిరువూరు సీఐ ఆర్ భీమరాజు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
This browser does not support the video element.
నిరంతరం శ్రమించిన వ్యక్తి
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న నిరాహార దీక్షా శిబిరంకు వెళ్లి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సంఘీభావం తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఐడీను అడ్డు పెట్టుకుని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు.
రెండో రోజు సీఐడీ విచారణ
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబును రెండో రోజు సీఐడీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు పలు ఫైళ్లను చంద్రబాబు ముందు ఉంచి ప్రశ్నించిన సీఐడీ అధికారులు నేడు కూడా పలు ప్రశ్నలను అడగనున్నారు. ఈ నేపథ్యంలోఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తారు. అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ చంద్రబాబును విచారించనుంది సీఐడీ. అయితే.. ఈ రెండు రోజుల విచారణలో చంద్రబాబు సమాధానాలతో సీఐడీ సంతృప్తి చెందకపోయినా.. ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని భావించినా.. చంద్రబాబును మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.