NEET PG: నీట్ పీజీ వాయిదా కుదరదు – సుప్రీంకోర్టు

పరీక్షకు రెండ్రోజుల ముందు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు లక్షల మంది పరీక్ష రాస్తున్నారని..50 మంది కోసం రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది.

New Update
NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు

NEET PG Exam: దేశవ్యాప్తంగా ఆగస్టు 11న నిర్వహించనున్న నీట్ పీజీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో నిర్ణీత షెడ్యూలు ప్రకారమే పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్షను వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకాగా.. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై ఆగస్టు 9న విచారణ జరిపింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షకు రెండురోజుల ముందు పరీక్షను వాయిదా వేయాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు వచ్చి.. నీట్‌ పీజీని వాయిదా వేయిస్తున్నారా..? ఆ పరీక్షను ఎలా వాయిదా వేయగలం? ఈ రోజుల్లో పరీక్షను వాయిదా వేయమని అడుగుతూ వస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రెండులక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉందని.. 50 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు పరీక్షను వాయిదా వేయాలని ఆదేశించలేమని చెప్పింది. కొందరు పిటిషన్లతో చాలామంది అభ్యర్థుల కెరీర్‌ను ప్రమాదంలో పడవేయలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అసౌకర్యంగా ఉన్న నగరాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌ను కేటాయించడం వల్ల చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విశాల్‌ సోరెన్‌ అనే వ్యక్తి పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇక పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరో పరీక్ష ఉన్నందున పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 2 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌ను ప్రమాదంలో పడేయలేమంటూ .. సుప్రీం ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా.. జూన్ 23న నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

హాల్‌టికెట్లు అందుబాటులో..
ఇప్పటికే నీట్ పీజీ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్' విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నీట్‌ పీజీ-2024 పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 185 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నీట్ పీజీ పరీక్షలో టైమ్-బౌండ్ సెక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పరీక్షలో సెక్షన్ల వారీగా సమయం కేటాయించనున్నారు. దీనిప్రకారం క్వశ్చన్ పేపర్‌ను సెక్షన్ల వారీగా విభజించి.. ప్రతి సెక్షన్‌కు కొంత సమయం కేటాయిస్తారు. ఆ సెక్షన్‌ను ఇచ్చిన సమయంలో పూర్తిచేసిన తర్వాతనే తర్వాతి సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించే నీట్‌ పీజీతో పాటు నిర్వహించే ఇతర పరీక్షల సమయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సెక్యూరిటీ, ప్రాముఖ్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నీట్ పీజీ పరీక్ష విధానం..
నీట్ పీజీ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.

అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్(PwD) అభ్యర్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (PwD కలిపి) అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం 185 నగరాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 34 నగరాలు/పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అమలాపురం, అమరావతి, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, కావలి, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, నంద్యాల, నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, రాజంపేట, సత్తుపల్లి, సిద్ధిపేట, సూరంపాలెం, సూర్యాపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: Madhya Pradesh: టీచర్ చేసిన తప్పుకు విద్యార్థి బలి

Advertisment
తాజా కథనాలు