Ambulance: అత్తగారింటికి వెళ్లాలి అనుకున్నాడు..సర్లే ఎలాగూ వెళ్తున్నాం కదా అని ఫుల్లుగా తాగాడు. నడుచుకుంటూ వెళ్లిపోదామనుకుని జర్నీ మొదలు పెట్టాడు. ఓ 40 కిలో మీటర్లు బాగానే నడిచేశాడు. ఆ తరువాత కాళ్లు నొప్పులు పుట్టినట్లున్నాయి. లిఫ్ట్ కోసం ఏకంగా 108 కి కాల్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. తీరా 108 సిబ్బంది వచ్చి ఆ వ్యక్తికి నచ్చజెప్పే సరికి తల ప్రాణం తోకలోకి వచ్చింది.
ఈ ఘటన హైదరాబాద్ - వరంగల్ (Hyderabad-Warangal) జాతీయ రహదారి పై రాయగిరిలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..హైదరాబాద్ లో రమేష్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి అతను జనగామలోని అత్తగారింటికి వెళ్లేందుకు కాలినడకన బయల్దేరాడు. అనుకున్నదే తడవుగా నడక ప్రారంభించాడు. అలా సుమారు 40 కిలో మీటర్లు నడిచాడు.
అలా యాదగిరి గుట్టకు చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన తరువాత కాళ్లు నొప్పి పుట్టడంతో ఫ్రీగా అత్తారింటికి వెళ్లేందుకు ఓ సూపర్ ఐడియాను ఆలోచించాడు. వెంటనే 108 సిబ్బందికి కాల్ చేసి అర్జంట్ గా రమ్మన్నాడు. వారు ఏదో అత్యవసరం అనుకుని హుటాహుటిన వచ్చారు. తీరా వచ్చి చూస్తే అవాక్కయ్యారు. ఫుల్లుగా తాగి ఉన్న వ్యక్తిని ఎందుకు అంబులెన్స్ కోసం ఫోన్ చేశావని అడిగితే..నేను నడవలేకపోతున్నానని , ఏ క్షణంలో కళ్లు తిరిగి పడిపోతానో తెలియదని ఆ వ్యక్తి చెప్పాడు.
అందుకే తనకు జనగామ (Jangama) వరకు లిఫ్ట్ (Lift) ఇవ్వాలని జనగామలో తాను వెళ్లాలనుకున్న ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదని చెప్పాడు. అతని మాటలు విన్న అంబులెన్స్ సిబ్బంది షాక్ అయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడానికి మాత్రమే అంబులెన్స్ ను వినియోగించాలని సిబ్బంది రమేష్‌కి వివరించారు. కానీ రమేష్ వారిని అంత తేలికగా విడిచిపెట్టలేదు. తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని, అంబులెన్స్ లో జనగామ వరకు తరలించాలని కోరాడు.
దీంతో సిబ్బంది భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్తామని అక్కడ కాళ్ల నొప్పులకు మందులు ఇస్తారని వారు చెప్పారు. అయినప్పటికీ కూడా రమేష్ వారిని విడిచిపెట్టకుండ జనగామ వరకు తీసుకుని వెళ్లాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్ష వాయిదా!