టాటా గ్రూప్‌, ఛారిటీలో గొడవలు.. రంగంలోకి కేంద్రం ప్రభుత్వం

టాటా గ్రూప్‌లో పాలనాపరమైన వివాదాలు, ట్రస్టీల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా గ్రూప్ అగ్ర నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు.

New Update
tata group

టాటా గ్రూప్‌లో పాలనాపరమైన వివాదాలు, ట్రస్టీల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా గ్రూప్ అగ్ర నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తో పాటు టాటా ట్రస్ట్స్ వైస్-ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డారియస్ ఖంబాటాలు అక్టోబర్ 7 రాత్రి ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. టాటా ట్రస్ట్స్‌లో చీలిక, బోర్డు నియామకాలపై తలెత్తిన వివాదాల కారణంగా సంస్థ కార్యకలాపాలు ప్రభావితం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.

విభేదాలకు కారణం ఏమిటి?
టాటా గ్రూప్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న టాటా ట్రస్ట్స్‌లో ట్రస్టీలు రెండు వర్గాలుగా విడిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. దివంగత రతన్ టాటా తర్వాత ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నోయెల్ టాటాకు ఒక వర్గం మద్దతుగా ఉండగా, షాపూర్జీ పల్లోంజి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న మెహలీ మిస్త్రీ నాయకత్వంలో మరో నలుగురు ట్రస్టీలు ఉన్నారు. కీలక నిర్ణయాల నుంచి తమను దూరంగా ఉంచుతున్నారని మిస్త్రీ వర్గం ఆరోపిస్తోంది. ముఖ్యంగా, టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకం, కంపెనీ లిస్టింగ్ అంశాలు విభేదాలకు దారితీశాయి.

కేంద్రం నుండి స్పష్టమైన సందేశం:
భారత ఆర్థిక వ్యవస్థకు టాటా గ్రూప్ అత్యంత కీలకం కాబట్టి, ఈ అంతర్గత వివాదం సంస్థ స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూడటంపై కేంద్రం దృష్టి పెట్టింది. "టాటా సన్స్‌లో ట్రస్ట్స్‌కు ఉన్న మెజారిటీ వాటా అనేది ప్రజా బాధ్యత" అని మంత్రులు టాటా ప్రతినిధులకు స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎలాంటి చర్యలు తీసుకునైనా సరే సంస్థలో స్థిరత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని కేంద్రం గట్టిగా సూచించింది. బోర్డు రూమ్ వివాదాలు గ్రూప్ కంపెనీల పనితీరుపై ప్రభావం చూపకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ కీలక సమావేశం తర్వాత, వివాదాస్పద అంశాలపై చర్చించడానికి అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం కానుంది. కేంద్రం జోక్యంతోనైనా టాటా గ్రూప్‌లోని ఆధిపత్య పోరుకు తెరపడుతుందో లేదో చూడాలి.

Advertisment
తాజా కథనాలు