Gold Rates :
బంగారం ధరలు మరోసారి దడ పుట్టిస్తున్నాయి. దేశీయంగా కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. శుక్రవారం ఒకేరోజు దేశ రాజధాని ఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.1,200 ఎగబాకి రూ.75,550 గా ఉంది. దీంతో గత రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
అంతకుముందు ఇది రూ.74,350 వద్ద ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,300 ఎగబాకి రూ.74,450కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.1,200 అందుకొని రూ.68,250 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,599.70 డాలర్లు పలుకగా, వెండి 30.47 డాలర్ల వద్ద ఉంది.
వెండి విషయం ఏంటంటే…
బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెడుతుంది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి శుక్రవారం మరో మారు అడుగు ముందుకేసింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.2,000 ఎగబాకి రూ.89 వేలకు చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
గతంలో ఇది రూ. 87 వేలుగా ఉన్నది. గత నాలుగు రోజుల్లో వెండి ఏకంగా రూ.5,200 పెరిగినట్లు అయింది. ఇటు హైదరాబాద్‌లో రూ.3,500 అధికమైన కిలో ధర రూ.95 వేలకు చేరింది.