భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం సంచలనంగా మారింది. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ అంశం ఇప్పుడు ఏపీని తాకడం మరింత సంచలనంగా మారింది. గత జగన్ సర్కార్ పేరు ఇందులో ప్రముఖంగా వినిపిస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందం స్కామ్‌లో జగన్ సర్కారుపై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు 228 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.1750 కోట్లు లంచాలను తీసుకున్నట్లు బ్రూక్లిన్ కోర్టు చేసిన ఆరోపణల్లో ఉంది.
అదానీ ఇచ్చిన లంచాలే కారణమా?
2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయినట్లు ఆ అభియోగాల్లో పేర్కొన్నారు. అప్పుడు విద్యుత్తు సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. అదే సమయంలో 7,000 మెగావాట్ల కొనుగోలు డీల్ కుదరడానికి అదానీ ఇచ్చిన లంచాలే కారణమని అభియోగాల్లో పేర్కొన్నారు. 2019-24 మధ్య పనిచేసిన ఓ అత్యున్నత స్థాయి వ్యక్తి హస్తం ఉన్నట్లు ప్రస్తావించారు. ఈ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్‌లోని అధికారితో పలు సమావేశాల్లో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ సమావేశాలు 2021 ఆగస్టు 7, సెప్టెంబరు 12, నవంబర్ 20 తేదీల్లో జరిగినట్లు ఆరోపణల్లో పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ లు డిసెంబర్ 1, 2021న SECI (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో 2.3 గిగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించి PSA లోకి ప్రవేశించాయి.
ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్!
రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీలకు (డిస్కమ్ లు) పవర్ సేల్ అగ్రిమెంట్‌లను (PSA) పొందేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మే 2019 నుండి జూన్ 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత స్థాయి వ్యక్తి సుమారు ₹1,750 కోట్లు ($228 మిలియన్లు) లంచం అందుకున్నట్లు ఆరోపణల్లో పేర్కొన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, జమ్మూ & కాశ్మీర్ కూడా అమెరికా అభియోగపత్రంలో పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఒప్పందాలకు రూ.279 కోట్ల లంచం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.
ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?
ఈ ప్రాజెక్ట్ ఏంటి?
నాటి ఏపీ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్య 10 వేల మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, 3700 మెగా వాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్లాంట్ ను స్థాపించడానికి ఉన్నత స్థాయిలో ఒప్పందం జరిగింది. ఇది ఇప్పటి వివాదానికి కారణమైంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10 వేల మందికి ఉపాధి కలుగుతుందన్న ప్రచారం అప్పట్లో జరిగింది.
ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?
న్యూయార్క్ లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రతివాదులు బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారన్నారు. ఇందుకోసం పెద్ద స్కెచ్ వేసినట్లు చెప్పారు. పెట్టుబడిదారులు, బ్యాంకులకు అబద్ధాలు చెప్పారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో అవినీతిని రూపుమాపేందుకు ఈ కార్యాలయం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు..
ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!