Share Market: నిన్న దేశీ మార్కెట్లు ముగిసే సమయానికి రికార్డ్ లాభాలను సాధించాయి. అయితే ఇవాళ ఉదయం మార్కెట్ ఫ్లాట్ గా మొదలైంది. అయితే కొద్ది సేపటి తర్వాత నెమ్మదిగా పుంజుకోవడం ప్రారంభించాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొనేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశమైన నేపథ్యంలో ఓ వైపు మదుపర్లు అప్రమత్తత పాటించినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల సంకేతాలు లభించడంతో మార్కెట్ ఊపందుకుంది. దానికి తోడు భారతీ ఎయిర్ టెల్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 41.86 పాయింట్ల లాభంతో 83030.64 వద్ద, నిఫ్టీ 20.20 పాయింట్ల లాభంతో 25403.20 దగ్గర ముగిశాయి.
హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలవగా.. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఉదయం 83,084.63 పాయింట్ల దగ్గర స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత కాసేపు నష్టాల్లోకి జారుకున్నా తిరిగి మళ్ళీ పుంజుకుంది. ఇంట్రాడేలో 82,866.68- 83,152.41 మధ్య చలించిన సూచీ.. చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079.66 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 34.80 పాయింట్ల లాభంతో 25,418.55 దగ్గర ముగిసింది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 83.75గా ఉంది.