/rtv/media/media_files/2025/09/13/rbi-small-loan-recovery-phone-lock-2025-09-13-09-45-31.jpg)
rbi small loan recovery phone lock
కొత్తగా స్మార్ట్‌ఫోన్లు కొనుగోలుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాక్ ఇవ్వబోతుంది. ఫోన్ కొనుక్కునే వారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని దానిని తిరిగి చెల్లించకపోతే తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఒక కొత్త నిబంధనను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
RBI Loan Recovery
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా.. మొండి బకాయిలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులు తిరిగి వాటిని చెల్లించడంలో విఫలమైతే.. బ్యాంక్ మీ ఫోన్‌ను తాత్కాలికంగా లేదా పూర్తిగా లాక్ చేసేందుకు పూర్తి అనుమతిని బ్యాంకుకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది బ్యాంక్‌లకు తమ రుణాలను తిరిగి పొందేందుకు ఒక కొత్త మార్గంగా మారిందని నిపుణులు అంటున్నారు.
దీని కారణంగా మీరు లోన్ తిరిగి చెల్లించకపోతే, బ్యాంక్ మీ ఫోన్‌లోని కొన్ని ఫీచర్‌లను డిసేబుల్ చేసే వీలుంటుంది. ఉదాహరణకు.. మీరు కాల్స్ చేయలేరు, ఇంటర్నెట్ వాడలేరు. కొన్ని అప్లికేషన్‌లను ఓపెన్ చేయలేరు. ఇలా డబ్బు చెల్లించే వరకు ఫోన్‌ను వాడకుండా అడ్డుకుంటుంది. లోన్ చెల్లించిన తర్వాతే బ్యాంక్ మీ ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా మీ లోన్ అగ్రిమెంట్‌లోనే స్పష్టంగా ఉంటుంది. మొబైల్ కంపెనీలు, బ్యాంకులు కలిసి ఈ టెక్నాలజీని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ ద్వారా బ్యాంక్ ఒక కంట్రోల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ కంట్రోల్ వల్ల బ్యాంక్ మీ లోన్ స్టేటస్‌ను ట్రాక్ చేస్తుంది. లోన్ డ్యూ డేట్ దాటితే, బ్యాంక్ రిమోట్‌గా మీ ఫోన్‌లోని కొన్ని ఫీచర్‌లను ఆఫ్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఒక విషయం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 116 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడించింది.
2024లో హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో మూడింట ఒక వంతు చిన్నతరహా వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నట్లు అంచనా వేయబడ్డాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. వీటిపైనే మొండి బకాయిలు భారీగా పెరుగుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఈ తరహా మొండి బకాయిలను కంట్రోల్ చేసేందుకు ఆర్బీఐ ప్రయాత్నాలు చేస్తోన్నట్లు సమాచారం.