బీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. నారాయణ ఖేడ్ లో మూడు కుటుంబాల పాలన నడుస్తోందన్నారు. ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులంతా ఏకం కావాలన్నారు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
సంగారెడ్డి జిల్లా, నారాయణ ఖేడ్‌లో భవాని మందిర్ ను దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత రైమాన్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... మరోసారి కేసీఆర్ కు ఓటు వేస్తే మనల్ని ఇసుక దిబ్బలో బొంద పెడతారని హెచ్చరించారు.
దళిత బంధు, బీసీ బంధు ఇలా ఎన్ని బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రస్తకే లేదని తేల్చి చెప్పారు. ఈ దోపిడి దొంగల దుకాణం బంద్ చేసే వరకు తాను నిద్ర పోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బోరంచలో బసవేశ్వర, సంగమేశ్వర, ప్రాజెక్టులు కేవలం శిలా ఫలకాల వరకు పరిమితం అయ్యాయని విమర్శించారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడా పని జరిగిన దాఖలాలు లేవన్నారు.
వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున భోజనం అందుతుందని చెప్పారు. అందుకే బహుజన రాజ్యం రావాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. ప్పులు కొనే స్థితి నుంచి బెంజ్ కారు కొని స్థితికి అంతా ఎదగాలని ఆయన అన్నారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో చదువుకున్న బిడ్డలందరూ తన బిడ్డలేనని చెప్పారు. ఈ దొంగలు మన వేలుతోనే మన కన్ను పొడుస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అందుకే మనమందరం ఏకమై బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకుంటే బాగుపడతామన్నారు.