BRS: రెండు దశాబ్ధాల బీఆర్‌ఎస్ చరిత్రలో కొన్ని స్థానాలు ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా ఆయా స్థానాల్లో ఒక్కసారి కూడా బీఆర్‌ఎస్(BRS) జెండా పాతలేదు. 2001లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలతో పాటు పెద్దసంఖ్యలో ఉప ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ తలపడి సత్తాచాటిన సందర్భాలున్నాయి. కానీ, ఆ స్థానాల్లో మాత్రం ఒక్కసారీ గెలవలేకపోవడం గమనార్హం.
హైదరాబాద్(Hyderabad) ఓల్డ్‌సిటీలోని ఎంఐఎం స్థానాలతో పాటు రాష్ట్రంలో 6 స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. గోషామహల్, పూర్వ ఖమ్మం జిల్లాలోని మధిర, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి అనేకసార్లు పోటీ చేస్తూ వస్తోంది. అయినా ఇప్పటికీ అక్కడ ఆ పార్టీని విజయం వరించలేదు. దీనికి కారణాలేమై ఉంటాయన్న విషయమై పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా సీట్లు గెలిచిన సమయంలోనూ ఆ నియోజకవర్గాల్లో కారు పాగా వేయకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క సంచలన నిర్ణయం
మరోవైపు కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ ఈసారి తొలిసారి గెలిచింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన సబితా రెడ్డి, ఈసారి బీఆర్‌ఎస్ నుంచే పోటీకి దిగారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోనూ బీఆర్‌ఎస్ తొలిసారి విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీలో చేరిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికే ఈ ఎన్నికల్లో సీటిచ్చారు. ఆయన విజయం సాధించారు. భద్రాచలం నియోజకవర్గానిదీ ఇదే పరిస్థితి. ఇక్కడా బీఆర్‌ఎస్ తొలిసారి విజయం వరించింది. తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.