Dande Vithal: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం స్టే విధిస్తూ.. పిటిషన్‌పై విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అభ్యంతరం..
అయితే కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అలాగే ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అయితే దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించగా.. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం విశేషం.