BRS MLA Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఓ పెండ్లి వేడుకలో పాల్గొన్న ఆయన ఈటల రాజేందర్ ను కలిశారు. ఈటల కనిపించగానే వెళ్లి ఆప్యాయంగా మల్లారెడ్డి కౌగిలించుకున్నారు. మా అన్నతో ఫోటో తీయవయ్యా అంటూ మల్లారెడ్డి హల్‌చల్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి నువ్వే గెలుస్తున్నవే అంటూ ఈటలతో మల్లారెడ్డి చెప్పారు. కాగా మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈటలదే గెలుపని మల్లారెడ్డి ఓపెన్‌గా చెప్పడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి ఎంపీ రేసులో ఉన్నారు.
కేసీఆర్ మరో తలనొప్పి..
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారని స్వయంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ జరిగిన ప్రచారానికి రెండు పార్టీలో దెబ్బ తిని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సహాయ పడగా.. తాజాగా మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు వ్యాఖ్యలు చేయడం.. మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారానికి తెర లేపింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ మల్లారెడ్డి, ఈటల మధ్య జరిగిన సంభాషణను పెట్టి బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు దెబ్బ తినగా తాజాగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం లోక్ సభ ఎన్నికల్లోనూ దెబ్బ తీస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రచారం ఎవరికి ప్లస్ అవుతోంది?, ఎవరికి నెగటివ్ అవుతోందో? ఎన్నికల ఫలితాల నాడే తెలియాలి.