KCR Surgery Success : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) కు సర్జరీ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. యశోద ఆసుపత్రిలో వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. కేసీఆర్(KCR) ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు.
ALSO READ: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి ఈ రోజు ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాత్ రూంలో జారిపడటంతోనే కేసీఆర్ కు గాయం జరిగినట్లు పేర్కొన్నారు. ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయిందని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. కేసీఆర్ కోలుకోవడానికి 6-8 వారాలు పడుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా కేసీఆర్ గాయపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని ఆందోళనకు గురయ్యానని చంద్రబాబు తెలిపారు. త్వరగా, సంపూర్ణంగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, సీఎం జగన్ తదితర నేతలు కేసీఆర్ తొందరగా కోలుకోవాలని అన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యంపై అరా తీశారు. యశోద ఆసుపత్రిలో భద్రతా పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రతీ అప్డేట్ ఇవ్వాలని వైద్యులను కోరారు.