Hyderabad Crime : వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్య(Suicide) కు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. రాజేంద్రనగర్(Rajendra Nagar) ఠాణా పరిధి హైదర్‌గూడ గుమ్మకొండకాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్ నాగేంద్రబాబు, బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారానికి చెందిన సోమేష్‌కు సూర్యాపేట జిల్లా కాసరబాదుకు చెందిన చామంతి (28)తో 2010లో పెళ్లి జరిగింది.
పదేళ్ల క్రితమే వారు అత్తాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. ఐదేళ్ల క్రితం గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్ ఓ ఇల్లు కొన్నాడు. మొదటి అంతస్తులో భార్యాపిల్లలతో కలిసి నర్సింహులు ఉంటుండగా కింది అంతస్తులో సోమేష్ కుటుంబం నివసిస్తోంది. సోమేష్ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా ఆయన భార్య చామంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
నర్సింహులు బావమరిది అయిన యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన శేఖర్(25) ఆర్నెల్ల క్రితం బావ వద్దకే వచ్చి ఉంటూ రెండు కుటుంబాలతో సఖ్యతతో మెలుగుతున్నాడు. మంగళవారం ఉదయం సోమేష్, నర్సింహులు, ఆయన భార్య సూర్యాపేటలో ఓ దశదినకర్మ కార్యక్రమానికి వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు పిల్లలను పాఠశాలకు పంపించిన చామంతి 10.30కు తల్లికి ఫోన్‌చేసిమాట్లాడింది.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చిన పిల్లలు తలుపుతట్టగా తల్లి తీయలేదు. కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో కుమారుడు చుట్టుపక్కలవారికి చెప్పడంతో వారంతా తలుపు బద్ధలు కొట్టిచూడగా హాల్లో చామంతి(Chamanthi), పడకగదిలో శేఖర్(Sekhar) ఉరేసుకుని కనిపించారు. సమాచారమందుకున్న పోలీసులు వచ్చి మృతదేహాలను పరిశీలించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ధ్రువీకరించారు.
అనంతరం ఉస్మానియా(Osmania) కు తరలించారు. వీరు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడ్డారనే దానిపై స్పష్టతలేదు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధముందా? అనే అనుమానాలను పోలీసులు, స్థానికులు వ్యక్తంచేస్తున్నారు.
Also read : సోషల్ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్!