Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బ్రిటన్ (UK) ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో భారత్ లో తల దాచుకున్న హసీనాకు తాము ఆశ్రయం ఇవ్వలేమంటూ సూచించినట్లు సమాచారం. ఈ మేరకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి ఆశ్రయం కల్పించడం కష్టతరమైన విషయంగా పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో హసీనా భారత్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.
నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు. ఇండియాలో ఆమెకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్వాగతం పలికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.