Maoist Letter on AP Elections 2024: సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అనుసరిస్తున్న రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను వెంటనే బహిష్కరించండంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) లేఖను విడుదల చేసింది. ఎన్నికలు జరగకుండా చూడాలని...ప్రజలు ఓటు వేయడాన్ని నిరాకరించాలని కోరారు. దేశానికీ, ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా ఉన్న బ్రాహ్మణీయ హిందూత్వ ఫాస్టిస్టు పార్టీ బీజేపీ (BJP), దానితో పొత్తు పెట్టుకున్న టీడీపీ (TDP), జనసేనలను (Janasena)...అలాగే అధికారంలో ఉన్న వైసీపీను తన్ని తరమాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అది కూడా ప్రజా వ్యతిరేక సామ్రాజ్యవాదాన్నే పెంచిపోషిస్తుంది కాబట్టి దాన్ని కూడా వ్యతిరేకించాలని లేఖలో కోరారు. ప్రస్తుతం జరుగుతున్న బూటకపు ఎన్నికలను బహిష్కరించమని కోరారు.
అన్ని పార్టీల వారూ దొంగలే..
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తోడుదొంగలుగా మారాయని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు దోపిడీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని, బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎవరైనా ప్రచారానికి వస్తే వారిని అడ్డుకోవాలని ఆ పోస్టర్లలో మావోయిస్టులు ప్రజలకు సూచించారు.
నేటి భూస్వామ్య వ్యవస్థను రద్దు చేస్తూ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలని లేఖలో కోరారు. నిజమైన ప్రజల రాజకీయాధికారాన్ని స్థాపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర-ఒడిశా బార్టర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.