Rathod Bapurao: మరో రెండు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ జెండాను వీడనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా వెల్లడించారు. గత నెలలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బాపురావు పేరు లేదు. ఈ నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న బాపురావుపై అనుచరులు కూడా పార్టీ మారాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే బాపురావు మాత్రం పార్టీని వీడేందుకు విముఖత వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా ఆయన ఇవ్వకపోవడంతో పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. గౌరవం లేని పార్టీలో ఉండటం అనవసరమని భావించిన ఆయన బైబై చెప్పేశారు.
కాంగ్రెస్ పార్టీ వైపు నేతల చూపులు..
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరంతా కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మిగిలిన వారు మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో సంచలనం రేపిన విషయం విధితమే. మంత్రి హరీష్‌రావుపై తీవ్ర విమర్శలు చేసిన మైనంపల్లి.. నెల రోజుల తర్వాత పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కూడా ప్రకటించేశారు. ఈ నెల 27న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌తో కలిసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. వారితో పాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.
గులాబీ పార్టీని వీడనున్న ఎమ్మెల్సీ..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది. 2018 ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. జైపాల్ యాదవ్ కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినా కూడా జైపాల్ యాదవ్ గెలుపుకోసం పని చేశారు. కానీ, ఈ సారి కూడా టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అధికార పార్టీలో టికెట్ దక్కని నేతలు ఎక్కువ మంది హస్తం గూటికి (Congress Party) చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఖమ్మానికి చేరిన తుమ్మల.. షాక్ ఇచ్చిన రేణుక.. కారణమిదేనా?