BJP Politics: ఏపీలోనూ బీహార్ మార్క్ రాజకీయం.. బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనా? 

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ మార్క్ పడబోతోందా? బీజేపీ మాస్టర్ ప్లాన్ అదేనా? జనసేన-టీడీపీ లను విడగొట్టి.. జనసేన-బీజేపీ కాంబినేషన్ సెట్ చేయబోతోందా? బీహార్ తరహా ఓటు బ్యాంక్ రాజకీయాలను ఏపీలోనూ అమలు చేస్తోందా? పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈ వివరణాత్మక కథనం చదవండి. 

New Update
BJP Politics: ఏపీలోనూ బీహార్ మార్క్ రాజకీయం.. బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనా? 

BJP Politics: ఏపీ రాజకీయాలు ఇప్పుడు పెద్ద పజిల్ గా మారిపోయాయి. అంతు పట్టని విధంగా రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ప్రజలు ఏమి అనుకుంటున్నారు అనేదానితో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఎవరికి నచ్చినట్టు వారు ఆటలు ఆడుకుంటున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యం అని ప్రతిపక్షాలు అన్నీ చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే పొత్తులు అంటూ హడావుడి చేస్తున్నాయి. ఈ విషయంలో జనసేన అందరికంటే ముందు నుంచి కలిసి ఉంటేనే వైసీపీని కొట్టగలం అనే స్టాండ్ తోనే ఉంది. అదే విధంగా బీజేపీతో కలిసి ఉంటూనే.. టీడీపీ తో పొత్తు ప్రకటన చేసేసింది. కానీ, బీజేపీ మాత్రం ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అటు టీడీపీ, జనసేనలతో కలిసి ముందుకు వెళతానని చెప్పడం లేదు. ఇటు వైసీపీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పుడు బీజేపీ వైఖరిపై రాష్ట్రంలో రకరకాల అంచనాలు వేస్తున్నారు. 

ఆ కులం ఓటు బ్యాంక్ కోసమేనా?

అయితే, బీజేపీ రాజకీయాలు(BJP Politics) స్పష్టంగా తెలిసిన వారు ఎవరూ కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఏపీలో నడుస్తుందని అనుకోవడం లేదు. ఇందుకు కారణాలు కూడా స్పష్టంగా చెబుతున్నారు. వాటిలో మొదటిది బీజేపీ బిగ్ బ్రదర్ గా ఉండాలని అనుకుంటుంది తప్ప.. ఎక్కడా తనని తాను తగ్గించుకోవడానికి ఇష్టపడదు. ఎక్కడైనా సరే తనకంటే తక్కువగా ఉండే వారితోనే జత కడుతుంది. ముఖ్యంగా ఓట్ల వేటలో ఎప్పుడూ వెనుకబడిన తరగతుల ఓట్ల బ్యాంకు కోసమే ఎదురుచూస్తుంది. ఆ ఓటు బ్యాంకు మీదే ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. దానికి ఉదాహరణ తాజాగా బీహార్ ఎపిసోడ్ తీసుకోవచ్చు. 

అంతుచిక్కని మోదీ గేమ్ ప్లాన్:

రాజకీయాలలో ఎప్పుడు ఏ ఆట ఆడాలో బీజేపీకి(BJP Politics) తెలిసినట్టు మరో పార్టీకి తెలియదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఎవ్వరు ఏమనుకున్నా.. ఎలాంటి పరిస్థితి వచ్చినా.. చివరి నిమిషం వరకూ అంతుపట్టని విధంగా వ్యవహరించడమే బీజేపీ శైలి. ఇప్పుడు బీహార్ లో పరిణామాలు వాటిని నిరూపిస్తున్నాయి. అక్కడ సీఎం నితీష్ కుమార్ నిన్నటివరకూ కాంగ్రెస్ తో కల్సి ఇండియా కూటమిలో ఉన్నారు. అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుని మునుపటి మిత్రుడు బీజేపీతో దోస్తీకి రెడీ అయిపోయారు. ఇది ఊహించనిది. ఇద్దరు డిప్యూటీ సీఎంలను తమ వాళ్ళని చేసుకుని.. సీఎం గా నితీష్ కుమార్ ను ఉంచేలా ఒప్పందం చేసుకుని,  బీజేపీ చురుకుగా పావులు కదిపి అధికారాన్ని గుప్పెట్లోకి తెచ్చుకుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ గేమ్ ఎవ్వరికీ అంతుచిక్కనిదిగా మారింది. 

అక్కడ బీసీలు.. ఇక్కడ కాపులు:

నిశితంగా పరిశీలిస్తే.. బీహార్ లో ఆర్జేడీ, జేడీయూ రెండూ పట్టు ఉన్న పార్టీలే. ఈ రెండిటి మధ్య పొత్తును విడదీసినపుడు.. రెండింటిలోనూ బలం ఎక్కువ వున్న ఆర్జేడీతో కలిసి బీజేపీ వెళ్ళాలి మామూలు లెక్కల్లో. కానీ, ఆర్జేడీ లాలూ ప్రసాద్ పార్టీ. అక్కడ ఆయన డామినేషన్ ఎక్కువ. ఆ పార్టీతో కలిసి వెళితే లాలూ చెప్పినట్టు గానే పరిస్థితి ఉంటుంది. మరోవైపు జేడీయూ లీడ్ చేస్తున్న నితీష్ కుమార్ పాత మిత్రుడు. పైగా అక్కడ బీసీలలో ఎక్కువ శాతం ఓటు బ్యాంకు ఉన్న కుర్మీ కులస్థుడు దీంతో ఆ ఓటు బ్యాంకు కోసం గతంలో తనను వదిలి వెళ్ళిపోయినా.. నితీష్ తోనే ముందుకు వెళ్ళడానికి సిద్ధం అయిపొయింది. 

కట్ చేస్తే.. సరిగ్గా అదే బీహార్ ఫార్ములా ఇప్పుడు బీజేపీ ఏపీలో ప్రయోగిస్తోందాననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఏపీలో వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీకి నష్టం లేదు. ఎందుకంటే, అది బీజేపీ అనధికార మిత్రపక్షం అనేది బహిరంగ సత్యం.  దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో జనసేన-టీడీపీ రెండిటిలో బీజేపీకి జనసేన ముద్దొచ్చే పార్టీ. ఎందుకంటే ఏపీలో నిర్ణయాత్మకమైన వర్గంగా భావించే కాపు సామాజిక వర్గానికి దానిని ప్రతినిధిగా భావిస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాపు వర్గానికి నాయకుడిగా చెప్పుకుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీకి ఏ మాత్రం పొసగే పరిస్థితి లేదు. దానికీ కారణాలు చాలానే ఉన్నాయి. అయితే, పవన్ - బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తు అంటున్నారు. వారిద్దరి దోస్తీ కట్ చెయ్యడానికి ఇప్పుడు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకోసమే చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చిందనేది వారి వాదనగా ఉంది. దీనికీ బీహార్ కీ కూడా ఓ లింక్ ఉంది. దేశ అత్యున్నత పౌర పురస్కారం  భారతరత్న బీహార్ లోని బీసీ మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చారు. అది కూడా అక్కడి ఆ ఓటు బ్యాంకు కోసమే అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ లెక్కల్లోనే ఏపీ రాజకీయాలు కూడా పూర్తిగా బీహార్ రాజకీయాల్లా మార్చేసే పరిస్థితి తీసుకువస్తోంది బీజేపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని బీజేపీ పెద్దలు ఢిల్లీ పిల్చారని వార్తలు వస్తున్నాయి. పవన్ కూడా ఢిల్లీ యాత్రకు రెడీ అయ్యారని తెలుస్తోంది. 

Also Read:  స్క్రిప్ట్ ఇస్తే చాలు.. వీడియో రెడీ.. AIతో గూగుల్ సంచలనం 

చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నం?

ఈ క్రమంలో బీజేపీ పవన్ ముందు బిగ్ ఆఫర్ పెట్టబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. అందులో మొదటిది.. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం. రెండోది పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లడం.. అయితే, పొత్తులో టీడీపీకి అవకాశం లేదు అనేది కచ్చితంగా చెప్పబోతోందని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు పవన్ ను ఒప్పించేందుకు ఒక మార్గం కూడా ఉందని అనుకుంటున్నారు. ఎలానూ ఈసారి జనసేన-టీడీపీ పొత్తుతో వెళ్లి గెలిచినా చంద్రబాబు సీఎం అవుతారు. పవన్ కు ఛాన్స్ ఉండదు. తరువాత ఎలక్షన్ సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. అదే బీజేపీ - జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లి.. ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి రెండు పార్టీలు బలపడి అధికారాన్ని సాధించవచ్చని.. అప్పుడు కచ్చితంగా పవన్ సీఎం అవడం ఖాయం అనీ బీజేపీ పవన్ కు చెప్పబోతోందని తెలుస్తోంది. 

బీజేపీకి రాష్ట్రాలలో ఎవరు అధికారంలో ఉన్నా పెద్ద పట్టింపు ఉండదు. కావాల్సింది కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండడం. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ, కాంగ్రెస్ ను ఎంత ద్వేషిస్తోందో.. చంద్రబాబు విషయంలోనూ అంతే ద్వేషం బీజేపీకి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ను ఎదిగేలా చేయడం ద్వారా ఏపీలో ప్రత్యామ్నాయాన్ని సృష్టించి.. అక్కడి బలమైన కాపు ఓటు బ్యాంక్ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా ఏపీలో ఎక్కువ సీట్లు గెలవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. 

Watch This Interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు