సమాజంలో ఎంతో గౌరవ స్థానంలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు..ఓ మహిళా ఎమ్మెల్యే (mla) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో (Social media) ప్రచారం కావడంతో వైరల్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్‌లోని (uttarapradesh) అలీగఢ్ లోని కోల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ కూడా హాజరయ్యారు.
వేదిక మీద కూర్చున్న తరువాత ఎంపీ తన పక్కన ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యే పై చేతులు వేస్తూ, వికృతంగా తాకుతూ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ చర్యలతో మహిళా ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఆమె ఆయన చేష్టల వల్ల చాలా ఇబ్బంది పడినట్లు వీడియోలో తెలుస్తుంది.
దీంతో ఆమె తన సీటును మార్చమని వేదిక మీద ఉన్న వారిని అడిగారు. దీంతో వారు ఆమె ఇబ్బందిని గమనించి వేరే చోటుకి సీటు మార్చారు. ఇది అంతా కూడా సెప్టెంబర్ 25న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కోల్ ఎమ్మెల్యే అనిల్ పరాశర్ శ్రీరామ్ బాంక్వెట్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన జరిగిన సమయంలో వేదిక మీద రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్, మాజీ మేయర్ శకుంతలా భారతి, బీజేపీ కార్యవర్గ సభ్యురాలు పూనమ్ బజాజ్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు విజయ్ సింగ్ ఉన్నారు. ఘటనకు సంబంధించిన మహిళా ఎమ్మెల్యే కూడా హాజరైన వారిలో ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎంపీ మహిళా ఎమ్మెల్యే భుజాల పై చేతులు వేసి ఆమెను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే వేదిక మీదనే మరో చోటుకు ఆమె సీటును మార్చుకున్నారు.
బీజేపీ ఎంపీ మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించిన తీరుతో విపక్షాలు మండిపడుతున్నాయి. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మహిళా కే సాటి మగాడి నుంచి రక్షణ లేనప్పుడు దేశంలోని మిగిలిన మహిళల సంగతేంటని విమర్శిస్తున్నారు.