Telangana: సీఎంగారు ఇదేం పని.. రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ సంచలన లేఖ..!

తబ్లిగీ జమాత్ సంస్థకు రూ. 2.45 కోట్ల నిధులు మంజూరు చేయడం బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తబ్లిగీ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

New Update
Telangana: సీఎంగారు ఇదేం పని.. రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ సంచలన లేఖ..!

MP Bandi Sanjay Letter to CM: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ సీఎంను ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం సీఎంకు ఒక లేఖ రాశారు బండి సంజయ్. మరి ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? బండి సంజయ్ ఆ నిర్ణయాన్ని ఎందుకు తప్పు పట్టారు? ఆయన రాసిన లేఖలో ఏముందో ఓసారి చూద్దాం.

తబ్లిగీ జమాత్ సంస్థకు రూ. 2.45 కోట్ల నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బండి సంజయ్. బలవంతపు మత మార్పిళ్లను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తబ్లిగీ జమాత్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వచ్చే నెల(జనవరి) 6, 7, 8 తేదీల్లో ఇస్లామిక్ సమాజం పేరిట తబ్లిగీ జమాత్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశం కోసం రూ.2కోట్ల 45 లక్షలకుపైగా నిధులు మంజూరు చేయడం దారుణమన్నారు బండి సంజయ్. ఒకవైపు రాష్ట్రం దివాళా తీసిందని, వడ్డీలు కట్టడానికే ఖజానా సరిపోవడం లేదని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. టెర్రరిజం, ఇస్లాం మత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న తబ్లిగీ జమాతే సంస్థ నిర్వహించే కార్యక్రమానికి నిధులివ్వడమేంటి? అని నిలదీశారు. కుహాన లౌకికవాద ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరం అని ఫైర్ అయ్యారు బండి సంజయ్.


కరోనా మహమ్మారి సమయంలో భారత్‌లో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం తబ్లిగీ జామాతే కారణం ఆరోపించారు బండి సంజయ్. 2020లో ప్రత్యేకించి డిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్ భవన్‌లో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు తబ్లిగీ జమాత్ నిర్వహించిన మత ప్రార్థనలే దేశంలో కోవిడ్ వ్యాప్తికి కారణమని లోకమంతా కోడై కూసిందన్నారు బండి సంజయ్. సరిగ్గా మళ్లీ భారత్‌లో కరోనా వ్యాపిస్తోందనే సమయంలో ఈ సంస్థ సభలు, సమావేశాల పేరుతో తెలంగాణలోకి ప్రవేశించడం అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నారు. టెర్రరిజం, బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న ఈ సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నిధులిస్తూ ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ.

Also Read: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..

టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందనే కారణంతోనే ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజాఖ్‌స్తాన్ దేశాలు తబ్లిగీ జమాత్ సంస్థను నిషేధించాయని గుర్తు చేశారు బీజేపీ ఎంపీ. ప్రార్థనా మందిరాల్లోకి ఆ సంస్థ సభ్యులు రాకూడదని, ఆయా దేశాల ప్రజలెవరూ ఆ సంస్థతో సంబంధాలు ఏర్పరచుకోకూడదని స్పష్టం చేశాయని తన లేఖలో పేర్కొన్నారు బండి. భారత దేశానికి పెను ప్రమాదంగా మారిన తబ్లిగీ జమాత్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. 'కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా? ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? తుక్డే తుక్డే గ్యాంగ్‌తో తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు?' అని లేఖలో ప్రశ్నించారు బండి సంజయ్.

తీవ్రవాద భావజాల వ్యాప్తికి, బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వెనుక సూత్రధారులెవరో తేల్చాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ బండి సంజయ్. తక్షణమే వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో జరిగే తబ్లిగీ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారాయన. లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read: ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్..

Advertisment
తాజా కథనాలు