పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్ సభ ఎన్నికలను నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆమె అన్నారు. క్యాంపెయిన్ కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను కమల నాథులు బుక్ చేశారని వెల్లడించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సారి దేశం 'నిరంకుశ' పాలనను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
రాష్ట్రంలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుళ్లకు 'చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు' చేస్తున్న కొందరు వ్యక్తులే కారణమని ఆమె ఆరోపించారు. కొంత మంది పోలీసు వ్యక్తల సహకారంతోనే ఇది జరిగిందని ఆమె మండిపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలను బీజేపీ నిర్వహిస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఇతర పార్టీలకు ప్రచారానికి అవకాశం లేకుండా అన్ని హెలికాప్టర్లను ఆ పార్టీ బుక్ చేసిందన్నారు.
దేశంలో వివిధ వర్గాల మధ్య కాషాయ పార్టీ శత్రుత్వాన్ని పెంచిందని పేర్కొన్నారు. అలాంటి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే అది మన దేశాన్ని ద్వేషపూరిత దేశంగా మారుస్తుందని చెప్పారు. బెంగాల్ లో మూడు దశాబ్దాల పాటు పాలన సాగించిన కమ్యూనిస్టులను తాను ఓడించానని పేర్కొన్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కూడా ఓడిస్తామని ఆమె అన్నారు.
జాదవ్ పూర్ వర్సిటీలో ‘గోలీమార్’అని ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారని చెప్పారు. వర్సిటీలో ద్వేషపూరిత నినాదాలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని పేర్కొన్నారు. అలాంటి నినాదాలు చేస్తున్న వారందరూ ఇది బెంగాల్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎలా పడితే అలా నినాదాలు చేసేందుకు ఇది యూపీ కాదన్నారు.