వేములవాడ బీజేపీ (BJP) టికెట్ తనకే దక్కుతుందని తుల ఉమ (Thula Uma) ధీమా వ్యక్తం చేస్తారు. వాస్తవానికి ఫస్ట్ లిస్ట్ లోనే తన పేరు రావాల్సి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన తనకు టికెట్ కోసం పోరాడే పరిస్థితి వస్తుందని భావించడం లేదన్నారు. తనకు టికెట్ రావాలని వేములవాడ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. తనకు బీజేపీ టికెట్ ఇస్తే ప్రజలే ఖర్చు పెట్టుకుని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీసీ మహిళ అయిన తనకు హైకమాండ్ తప్పకుండా అవకాశం కల్పిస్తుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలతో సంబంధాలు లేవన్నారు.
ఇది కూడా చదవండి: TS BJP: తెలంగాణ బీజేపీలో కొత్త చిచ్చు.. ఈటల సీరియస్, కొండా అలక.. అసలేమైందంటే?
కాంగ్రెస్ అభ్యర్థికి కూడా సానుకూల వాతావరణం లేదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న తనకు టికెట్ ఇస్తే గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి బీజేపీ తనకు టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు. బండి సంజయ్ కు తన గురించి పూర్తిగా తెలుసన్నారు. ఆయన కౌన్సిలర్ గా ఉన్న సమయంలో తాను జడ్పీ చైర్మన్ గా ఉన్నానని గుర్తు చేశారు. మహాలక్ష్మి ఆలయానికి అనేక సార్లు తనను బండి సంజయ్ గెస్ట్ గా ఆహ్వానించారన్నారు.
ఆ సమయంలో ఆయన అడిగిన పనులను తాను చేసిపెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నారు. బండి సంజయ్ తనకు సోదరుడితో సమానమన్నారు. కానీ.. తనకు టికెట్ రాకుండా ఆయన ఎందుకు అడ్డుపడుతున్నాడో తెలియదని తుల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. తనకు టికెట్ రాకపోతే.. ఇందుకు గల కారణాలను చెప్పాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంటుందన్నారు.