రాజకీయ నాయకుడు అంటే వయసుతో సంబంధం లేకుండా ఓటర్ల వద్దకు వెళ్లాలి, వారి కష్టసుఖాలను తెలుసుకోవాలి...రానున్న ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించమని పగవాడిని అయినా..ప్రతిపక్షం వారిని అయినా వేడుకోవాలి. కానీ ఇలా చేతులు జోడించి ఓట్లు అడగడం నచ్చలేదంటున్నారు బీజేపీ సీనియర్ నేత(Bjp ) ( Senior Leader) కైలాష్ విజయవర్గీయ.(Kailash vijay Vargeeya)
కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Elections)తరుముకొస్తున్న వేళ..ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన రెండో జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ కూడా ఉన్నారు.
ఆయనను ఇండోర్ నుంచి పోటీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తనను పార్టీ పెద్దలు అభ్యర్థిని చేయడం గురించి ఆయన షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే ఆయన తనను అభ్యర్థిగా నిలబెట్టడం పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాకు అసలు ఎన్నికల్లో నిలుచోవాలనే కోరిక అసలు లేదు. నేను చాలా పెద్ద రాజకీయ నాయకుడ్ని అవ్వడం వల్ల నేను ప్రజల ముందు చేతులు జోడించి ఓట్లు అడగలేనని కైలాష్ విజయవర్గీయ అన్నారు.
కైలాష్ విజయ వర్గీయ మాట్లాడుతూ..''నాకు టికెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు. రోజూ 8 సమావేశాలు పెట్టాలి అని ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. స్పీచ్ లు ఇవ్వాలి వెళ్లిపోవాలి. దాని కోసం ప్లాన్ కూడా తయారు అయ్యంది. కానీ ప్రజలు అనుకుంటే ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు.
ఇంతలోనే మళ్లీ ఆయన మరో ప్రకటన చేశారు. ''నేను ఎన్నికల బరిలో నిలవకూడదు అనుకుంటున్నాను. అయితే నిన్న గాక మొన్న పార్టీ సీనియర్ నేతల నుంచి నాకు ఆదేశాలు వచ్చాయి. దాంతో నేను కాస్త గందరగోళానికి గురయ్యాను. హఠాత్తుగా నా పేరు ప్రకటించడంతో నేను ఆశ్చర్యపోయాను. అయితే, ఇది నా అదృష్టం. పార్టీ నన్ను ఎన్నికల్లో పోటీకి పంపింది. నేను పార్టీ సైనికుడిని. పార్టీ ఆశలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను’’ అని కైలాష్ విజయవర్గియ అన్నారు.