/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-1-3-jpg.webp)
బీజేపీ నేతలు తనపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చని, కానీ దాని వల్ల ప్రజలతో తనకు ఉన్న అనుబంధం తెగిపోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తనపై బీజేపీ ఎన్ని సార్లు అనర్హత వేటు వేస్తే ప్రజలతో తనకు ఉన్న అనుబంధం అంత బలపడుతుందన్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించిన తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ తన నియోజక వర్గం వయనాడ్ లో పర్యటించారు.
వయనాడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... వయనాడ్ అనేది తన కుటుంబం అన్నారు. కుటుంబం ఎలా పని చేస్తుందనే విషయం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు తెలియదన్నారు. ఎవరైనా ఓ వ్యక్తి ఇద్దరు సోదరులను లేదా ఓ తండ్రిని తన కూతురిని విడదీయాలనుకుంటే వాళ్ల బంధం బలహీన పడుతుందా లేదా బలపడుతుందా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా ఆ బంధం బలపడుతుందన్నారు.
ప్రజలను, తనను వేరు చేయాలని ఎంత ప్రయత్నిస్తే తాము అంత దగ్గరవుతామన్న విషయం బీజేపీ నేతలకు తెలియదన్నారు. అనర్హత వేటు వేస్తే ప్రజలతో తనకు ఉన్న సంబంధం తెగి పోతుందని బీజేపీ భావిస్తోందన్నారు. కానీ అలా కాదన్నారు. తనపై అనర్హత వేటు వేస్తే ప్రజలు తనకు మరింత దగ్గరవుతారన్నారు. ప్రజలను, కుటుంబాలను బీజేపీ విభజిస్తుందన్నారు.
మణిపూర్ లోనూ బీజేపీ అదే పని చేసిందన్నారు. దాన్ని తాము పునర్నిస్తామన్నారు. మణిపూర్ ను కాషాయపార్టీ రెండు నెలల్లో తగుల బెడితే తాము ఐదేండ్లలో దాన్ని పునర్నిర్మిస్తామన్నారు. భారత్ అనేది ఒక కుటుంబమని, దాన్ని వాళ్లు విభజించాలని అనుకుంటున్నారని చెప్పారు. మణిపూర్ ఒక కుటుంబమని దాన్ని నాశనం చేయాలని వాళ్లు అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
బీజేపీ సిద్దాంతాల వల్ల వేల కుటుంబాలు నాశనమయ్యాయన్నారు. కుటుంబాల మధ్య సంబంధాన్ని నాశనం చేస్తుందన్నారు. కానీ అదే ప్రజలను తమ పార్టీ కలుపుతుందన్నారు. మణిపూర్ ను బీజేపీ హత్య చేసిందన్నారు. మణిపూర్ తగులబడుతూ వుంటే ప్రధానిగా మీరు నవ్వుతూ కూర్చున్నారా అంటూ ఫైర్ అయ్యారు. భారత మాత గురించి కేవలం రెండు నిమిషాలు మాట్లాడుతారా అని ప్రశ్నించారు.