Madhavi Latha - Telangana BJP MP Candidate: బీజేపీ విడుదల చేసిన తెలంగాణ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో... అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు డాక్టర్ మాధవీలత. మొత్తం 9 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించగా... అందులో ఏకైక మహిళా అభ్యర్ధి మాధవీలత. అసలు ఎవరు ఈమె అన్నదే... తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి మాధవీలతకి ఇప్పటివరకూ భారతీయ జనతాపార్టీలో సభ్యత్వం కూడా లేదు. రాజకీయ నేపథ్యమూ లేదు. అలాంటిది ఒక్కసారిగా బీజేపీ అభ్యర్ధుల జాబితాలో ఆమెకి స్థానం ఎలా దక్కిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ALSO READ: ఇద్దరు ఎంపీలను ప్రకటించిన కేసీఆర్
డాక్టర్ మాధవీలత అంటే విరించి ఆస్పత్రుల చైర్‌పర్సన్. పూర్తి పేరు కొంపెల్ల మాధవీలత. ఎక్కవగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటారు. పాతబస్తీలో తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతుంటారు. అన్నిటికీ మించి వ్యాపారవేత్తగా ధనబలం ఉన్న వ్యక్తి. ఆమెకి టికెట్ ఇవ్వాలని రాష్ట్రనాయకత్వం నుంచే నివేదిక వెళ్లడంతో టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
డాక్టర్ మాధవీలత కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. భరతనాట్య నర్తకిగా కూడా పేరుంది ఆమెకి. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ నగరంలో సేవలు చేస్తున్నారు. ఆమె వేషధారణ కూడా వినూత్నంగా కనిపిస్తుంది. కోట్లరూపాయల ఆస్తి ఉన్నా... కాషాయపు మడిలో, నుదుటిపై పెద్ద బొట్టుతో వినూత్నంగా కనిపిస్తుంటారు. ఆమె స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్, ఆసుపత్రి ద్వారా పాతబస్తీలో సేవలు చేస్తున్నారు మాధవీలత.
మరోవైపు మాధవీలతకి కేటాయించిన సీటు కూడా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే హైదరాబాద్ నియోజకవర్గం అంటే మజ్లిస్‌కు తిరుగులేని లోక్‌సభ స్థానం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుటుంబానికి కంచుకోట. 1984 నుంచి 1999 వరకు అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. ఆ తర్వాత 2004 నుంచి 2019 వరకు నాలుగుసార్లు అసదుద్దీన్ గెలిచారు. అంటే దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ అసదుద్దీన్ కుటుంబం హవానే నడుస్తోంది. అలాంటిచోట మాధవీలత ఎంతమేరకు పోటీ ఇస్తుందో చూడాలి. అసదుద్దీన్‌పై గెలిస్తే మాత్రం మాధవీలత చరిత్ర సృష్టిస్తుంది.