CM Revanth Reddy: పార్లమెంటు ఎన్నికల (Lok Sabha Elections) వేళ ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీచేసింది. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా, హోం శాఖ మంత్రిగా రేవంత్ ఒక్కరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని జగదీష్ రెడ్డి న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఒకవేళ ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు.
సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో..?
కాంగ్రెస్ అధికారం చేపట్టాక గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరినీ నగ్నంగా పరేడ్ చేస్తా అని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు ఇచ్చారు. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశాలిచ్చింది. అయితే.. సీఎం రేవంత్ ఈ నోటీసులను ఎలా తీసుకుంటారు..? స్పందన తర్వాత ఏం జరగబోతోంది..? అనే దానిపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎంపీ.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్