Sajjala : కౌంటింగ్ ఏజెంట్ల (Counting Agents) విషయంలో చేసిన వ్యాఖ్యలకు గాను వైసీపీ (YCP) ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడారని సజ్జలపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కేసు నేపధ్యం ఇదీ..
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ అగ్రనేతలు కౌంటింగ్ ఏజెంట్ల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. “ఇదే మన లక్ష్యం అని భావించి.. దీనికి ఏం అవసరమో తెలుసుకోవాలి.. ఇతరులు (ప్రతిపక్ష పార్టీలు) జోక్యం చేసుకోకుండా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చూడండి.. వారు అడ్డుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం చూడాలి. అలా కాకుండా ఒక్క ఓటు కూడా చెల్లుబాటు కాకుండా పోతుందని, ఏదైనా సమస్య వచ్చినపుడు అది రూల్ అని చెప్పి మాట్లాడకుండా వదిలివేయకూడదు. అలాకాకుండా పోరాటం చేసే ఏజెంట్లే కావాలి. ఈ విషయంలో మీరు (ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లు) వారికి (కౌంటింగ్ ఏజెంట్లకు) పోరాటం చేసే విధానం నేర్పాలి. పోరాటం చేయగలిగిన కౌంటింగ్ ఏజెంట్లే మనకు అవసరం. అలా చేయలేని వారు మనకు వద్దు.” అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.
Also Read: ఏపీలో ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి హింసకు ఛాన్స్ లేదు
ఈ వ్యాఖ్యలు కౌంటింగ్ ఏజెంట్స్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయని అభ్యంతరం చెబుతూ సజ్జలను అరెస్ట్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.