Joe Biden: వైద్య పరీక్షలకు సిద్ధమే.. జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

తన మానసిక స్థితి బాగుందని నిరూపించుకోవడానికి అవసరమైతే వైద్య పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. వైద్యులు సూచిస్తే తప్పకుండా వెళ్తానన్నారు. నేను ఏం చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదంటూ వాపోయారు.

New Update
Joe Biden: వైద్య పరీక్షలకు సిద్ధమే.. జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మానసిక స్థితి బాలేదని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాషింగ్టన్‌లో జ‌రిగిన నాటో శిఖ‌రాగ్ర స‌మావేశం సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బైడెన్ మ‌రోసారి తడబడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడుని పరిచయం చేస్తూ.. జెలెన్‌స్కీని అని కాకుండా పుతిన్ అని నోరు జారారు. ఆ తర్వాత పుతిన్‌పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఆయన పేరే గుర్తుకువచ్చిందంటూ సర్దిచెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Also read: పూజాకు షాక్‌..! ఆరోపణలు నిజమని తేలితే.. ఊడనున్న ఉద్యోగం

అయితే నాటో సదస్సు ముగిసిన తర్వాత జో బైడన్‌ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. తన మానసిక స్థితి బాగుందని నిరూపించుకోవడానికి అవసరమైతే తాను వైద్య పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. సొంత పార్టీ నేతల నుంచి కూడా బైడెన్ మానసిక స్థితిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. నా వైద్యులు మరోసారి న్యూరోలాజికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని చెబితే.. వారిని నేను వ్యతిరేకించనని.. తప్పనిసరిగా వాళ్లు చెప్పింది పాటిస్తానన్నారు. తన చుట్టూ ప్రతిభావంతమైన వైద్యులు ఉన్నారని.. తనలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా గుర్తించి ఎప్పుడైనా సూచనలు చేయవచ్చని చెప్పారు.

అలాగే తాను ఇప్పటికే ఫిట్‌గానే ఉన్నానని.. నేను ఏం చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదని బైడెన్‌ వాపోయారు. అధ్యక్ష పదవి చేపట్టాక మూడుసార్లు న్యూరోలాజికల్ పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. తన న్యూరోలాజికల్‌ సామర్థ్యం సరిగ్గానే ఉందని స్పష్టం చేశారు. తోటి డెమోక్రాట్లు బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి వైదొగలగాలని డిమాండ్ చేస్తుండగా.. తాజాగా బైడెన‌ మీడియా సమావేశంలో తన అభ్యర్థిత్వాన్ని సమర్థించుకున్నారు. ఇదిలాఉండగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మధ్యే గట్టి పోటీ ఉండనుంది.

Also read: దారుణం.. దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు