కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) ఆ పార్టీని వీడనున్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. కొన్నిరోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు జిట్టా. అయితే.. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి (Kumbham Anil Kumar Reddy) భవనగిరి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం సాగుతుండడంతో జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని జిట్టాకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ రోజు భువనగిరిలో జరగనున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో జిట్టా బాలకృష్ణారెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?
2009 వరకు జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన చాలా యాక్టీవ్ గా పని చేశారు. అయితే.. 2009లో భువనగిరి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన జిట్టా బాలకృష్ణారెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆ పార్టీకి దూరమయ్యారు. ఇండిపెండెంట్ గా భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. దాదాపు ఏడాది క్రితం ఆయన తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆ పార్టీ అధినాయకత్వంపై ఇటీవల ఆయన తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ.
తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే జిట్టా కాంగ్రెస్ లోకి చేరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ.. కుంభం అనిల్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించడం.. ఆయనకే టికెట్ అన్నట్లుగా సంకేతాలు ఇవ్వడంతో బాలకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో దాదాపు 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరనున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి.