Bangalore Cafe : బెంగళూరు(Bengaluru) లోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe) పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దూకుడు పెంచింది. తాజాగా ఒకరిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది. బళ్లారిలోని కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అనే అనుమానితుడిని ప్రశ్నించనుంది. పేలుడు గురించిన సమాచారం షబ్బీర్‌కు ఉందని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఇటీవలి అతని ట్రావెల్ హిస్టరీ(Travel History) ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత వారం NIA పేలుడు కేసులో ప్రధాన అనుమానితులలో ఒకరి తాజా ఫొటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. రామేశ్వరం కేఫ్‌లో పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తిని గుర్తించడంలో సహాయం చేయాలని పౌరులకు కోరింది దర్యాప్తు సంస్థ.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లింకులు?
రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసుకు పాల్పడిన అనుమానితుడికి బెంగళూరులోని ప్రతి అంగుళం తెలుసునని ఎన్‌ఐఏ వర్గాలు చెబుతున్నాయి. నిందితులు కొన్నేళ్ల క్రితం రాష్ట్రం విడిచిపెట్టి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) తదితర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని విచారణలో తేలింది. రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన రోజున నిందితుడు చెన్నై- తిరుపతి రైల్వే ద్వారా బెంగళూరుకు వచ్చినట్టు సమాచారం. తర్వాత రాజాజీనగర్ సుజాత బస్టాండ్‌కు బీఎంటీసీ బస్సులో వచ్చాడు. కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో తుమకూరు వెళ్లాడు. అక్కడి నుంచి కర్ణాటకలోని పలు జిల్లాల్లో పర్యటించి బళ్లారి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి గుర్తు తెలియని ప్రదేశంలో తలదాచుకున్నాడని సమాచారం.
కర్ణాటకలో ఇప్పటి వరకు కుక్కర్, టిఫిన్ బాక్స్ బాంబు పేలుళ్లు జరిగాయి. అయితే రామేశ్వరం కేఫ్‌లో వెండి ప్లాస్టిక్ బాంబు పేలడం చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి బాంబు పేలుడు జరగడం ఇదే తొలిసారి. 'ఐసిస్' ఉగ్రవాదుల బెదిరింపుతోనే నిందితుడు ఈ పని చేసినట్లు ఎన్‌ఐఏకు సమాచారం ఉందనిట్టుగా తెలుస్తోంది. నిందితుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉందన్న వార్తలు చక్కర్లు కొట్టగా.. తాజాగా ఈ కేసుతో మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్.. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్!
అసలేం జరిగింది?
ఈ పేలుడు ఘటనకు సంబంధించి బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల(UAPA) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదైంది. మొదట బాంబు ఉన్న బ్యాగ్‌తో రామేశ్వరం హోటల్‌కు వచ్చిన ఓ వ్యక్తి టోకెన్ కొనుగోలు చేశాడు. కౌంటర్‌లో సెమోలినా ఇడ్లీ తీసుకున్నాడు. ఆ తర్వాత బాంబ్ ఉన్న బ్యాగ్‌ని హోటల్ వాష్ బేసిన్ వద్ద వదిలేశాడు. ఈ ఘటనలో మొత్తం 9మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో.. హోటల్ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు ఆ పేలుడుకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఈ ఘటన మార్చి 1న జరిగింది.
Also Read : పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మహిళలు కోసం ఉన్న ఈ స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి!