Rainy Season Diseases: వానల వల్ల కొన్ని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. ఎండలు తగ్గి వానలు మొదలవ్వడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. వర్షాల వల్ల వచ్చి చేరే నీటి వల్ల దోమలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఈ సీజనల్ ఛేంజ్ కొన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే రోగాలకు గాలి, నీరు, దోమలు ముఖ్య కారకాలుగా ఉంటాయి. అందుకే ఈ మూడింటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాలకు కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు వచ్చి చేరతాయి. ఇలా నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు సహా పలు రోగకారక క్రిములు కూడా వృద్ధి చెందుతాయి. వీటివల్ల వైరల్ జ్వరాలతోపాటు జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. తాగేనీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు, కలరా, కామెర్ల వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకూ కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
మబ్బులు పట్టి ఉన్నప్పుడు వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు వంటి ఎలర్జీలు ఎక్కువ అవుతాయి. సైనసైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. చల్లగాలికి దూరంగా ఉంటూ బయటకువెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. ఈ సీజన్‌లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దోమలు రెండు రకాలుగా ఉంటాయి.
రాత్రిపూట కుట్టే దోమలు మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వంటి సమస్యలకు కారణమవుతాయి. రెండో రకమైన దోమలు పగటి పూట కుడతాయి. ఇవి చికెన్ గున్యా, డెంగ్యూ వంటి రోగాలను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి వాతావరణం మారగానే ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కిటికీలు తెరచి ఉంచకుండా చూసుకోవాలి. వాటికి మెష్ వంటివి అమర్చితే మంచిది. అలాగే రాత్రిళ్లు కాళ్లు, చేతులు కవర్ అయ్యేలా బట్టలు వేసుకుని పడుకోవాలి.
మస్కిటో రిపల్లెంట్స్ వంటివి వాడాలి. వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్య తీవ్రతరం కాకముందే డాక్టర్‌ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ఈ సీజన్‌లో పిల్లల ఆరోగ్యం పట్ల కూడా తగిన శ్రద్ధ వహించాలి.