World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉండటంతో టిక్కెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంతమందికి మాత్రమే టికెట్లు దక్కాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానుల నుంచి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో బీసీసీఐ మరోసారి టికెట్ల విక్రయాలను ప్రారంభించింది. అన్ని మ్యాచ్‌ల కోసం మొత్తం 4లక్షల టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అభిమానుల డిమాండ్ నేపథ్యంలో వివిధ మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర సంఘాలతో మాట్లాడి 4 లక్షల టిక్కెట్లను విక్రయించేందుకు అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్ 8 రాత్రి 8గంటలకు ప్రారంభం..
ఈ టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 8వ తేది రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ టికెట్లు కావాలనుకునేవారు ఐసీపీ ప్రపంచకప్ 2023 అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. విపరీతమైన డిమాండ్ దృష్ట్యా వెంటనే టికెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఈ టికెట్ల విక్రయాల తర్వాత మారోసారి కూడా విక్రయాలు చేపడతామని.. దీనిపై త్వరలోనే అభిమానులకు సమాచారం ఇవ్వనున్నట్లు బీసీసీఐ చెప్పింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. ఇక యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.
అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్..
అయితే ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. భారత్, పాక్ మ్యాచ్ సహా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను అక్టోబర్ 14కి మార్చారు.
భారత్-పాక్ మ్యాచ్ టికెట్ రూ.57లక్షలు..
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లి మరీ టికెట్ కొనుగోలు చేసి వీక్షిస్తారు. అలా వీలుకాని వారు ఇంట్లో టీవీల్లోనో, మొబైళ్లలోనూ చూస్తారు. ఇక దాయాది దేశాల క్రికెట్ పోరును గల్లీలలో ప్రొజెక్టర్లు వేసి మరీ వీక్షించిన సందర్భాలు ఉన్నాయి. అయితే త్వరలో జరుగనున్న పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు సెకండరీ మార్కెట్‌లో రూ. 57 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇందుకు సంబందించిన వివరాలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య క్రేజ్ ఆ రేంజ్‌లో ఉండొచ్చు గానీ.. మరీ ఇంత ధర ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇది పూర్తిగా దోపిడీ అంటూ మండిపడుతున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను వయాగోగోలో వెబ్‌సైట్‌లో రూ 57,62,676 లకు విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టారు.
ఇది కూడా చదవండి: సెలక్టర్‌లకు మద్దతు తెలిపిన అశ్విన్