బీసీ బంధు కింద కుల వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న లక్ష రూపాయల సహాయం దేశానికే ఆదర్శమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో పర్యటించిన ఆయన.. లబ్దిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే.. నిరుపేదల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్ పాలనలో జుక్కల్ నియోజకవర్గంలో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యమైనందుకు తాను గర్వ పడుతున్నానన్నారు.
తన హయాంలో ఇప్పటి వరకు నియోజకవర్గంలోని దాదాపు 90 గ్రామాల్లో సీసీరోడ్లు పూర్తి చేశానన్న ఆయన.. ఇటీవలే మరో 10 గ్రామాల్లో రోడ్లు వేసినట్లు వెల్లడించారు. ఈ రోడ్లతో నియోజకవర్గంలో వందశాంత రోడ్ల నిర్మాణ పక్రియ పూర్తయిందన్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో పుట్టి పెరిగిన కొందరు జుక్కల్‌లో ఎమ్మెల్యే అవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్, నారాయణఖేడ్‌లో పుట్టి పెరిగిన వాళ్లు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడానికి వస్తున్నారన్న ఆయన.. బయటి వారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో చెప్పాలన్నారు.
వేరే ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వారికి మన గడ్డపై ఏం ప్రేమ ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు వచ్చేది కేవలం వారి స్వార్దం కోసమే అన్నారు. అలాంటి వారిని తరిమి కొట్టాలని ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడే పుట్టానని నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో, ఎవరి ఇబ్బంది ఏంటో తనకు తెలుస్తుందన్నారు. బయటి వాళ్లకు మన నియోజకవర్గంపై ఎలాంటి అవగాహన ఉండదన్నారు. అలాంటి నేతల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.