Barrelakka Meets Kodandaram: తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాంతో సిరీశ అలియాస్ బర్రెలక్క సోమవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో (MP Elections) పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, తదితర అంశాలపై ఆమె కోదండరాంతో చర్చించారు. స్థానిక పరిస్థితులను బట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాల్లో పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆమె కోరారు. ఆమె విజ్ఞప్తిపై కోదండరాం సానుకూలంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: మంత్రి పొన్నం ప్రభాకర్ vs ఎమ్మెల్సీ కవిత .. ట్విట్టర్ లో మాటకు మాట
పార్లమెంటు ఎన్నికలకు రూట్‌మ్యాప్ సిద్ధమైందా?
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో (Kollapur) హేమాహేమీలతో పోటీపడి ఐదున్నర వేల ఓట్లతో సత్తా చాటిన బర్రెలక్క మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల బరిలో దిగి దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత గొంతుకగా నిలుస్తానంటున్నారు. నాగర్‌కర్నూలు (Nagarkurnool) పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆమె, ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించినట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: TSRTC: హే రేవంత్.. యే క్యా హువా! బస్సుల్లో మహిళలు ఈ పనులు కూడా చేస్తున్నారే!
ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కూడా నిలుస్తానని, గెలిచే వరకూ పోటీ చేస్తూనే ఉంటానని చెప్పారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరాంతో సోమవారం ఆమె సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరి రమేశ్, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు నాగయ్య, తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ దార సత్యం, హైకోర్టు న్యాయవాది రామేశ్వరరావు పాల్గొన్నారు.