Rave Party: రేవ్‌ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!

బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించిన మూలాలు బెజవాడలో బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది విజయవాడ అని పోలీసులు గుర్తించారు. పూరింట్లో ఉంటూ తల్లితో దోసెలమ్మిన వాసు.. బుకీగా మారి కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.

New Update
Rave Party: రేవ్‌ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!

Bengaluru Rave Party: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న బెంగళూరు రేవ్‌ పార్టీ మూలాలు బెజవాడలో బయటపడ్డాయి. ఈ రేవ్‌ పార్టీలో అరెస్టైన ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది (Lankapalli Vasu) విజయవాడే. ఆంజనేయవాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. వాసు కుటుంబం పూరింట్లో ఉండేంది. తండ్రి మరణించడంతో తల్లి దోసెలమ్మి కుటుంబాన్ని పోషించేది. వాసుకి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. అయితే క్రికెటర్‌ కావాలన్న లక్ష్యమే వాసుని బుకీగా మార్చింది. క్రికెట్‌, హాకీ, కబడ్డీ ఇలా అన్ని క్రీడల్లో బుకీగా వ్యవహరించేవాడు. తెలుగు రాష్ట్రాలు సహా బెంగళూరు, చెన్నై ముంబైల్లో భారీగా బెట్టింగ్‌ (Betting) నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసుకున్నాడు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని మరింత విస్తరించి హైదరాబాద్‌, బెంగళూరుల్లో పబ్‌లు కూడా నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు విజయవాడలోనే ఉంటారు. వాసు అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్తుంటాడు. దుబాయ్‌, బెంగళూరు, మలేషియాలో పనిచేస్తానని చుట్టుపక్కలవారిని నమ్మించాడు.

అన్నీ కలిసొచ్చి రూ.కోట్లకు అధిపతి..
ఇలా క్రికెట్‌ బెట్టింగ్‌ మొదలుకుని రాజకీయ బెట్టింగ్‌ల వరకు అన్నీ కలిసొచ్చి రూ.కోట్లకు అధిపతి అయ్యాడు. క్రికెట్‌ సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్‌లు నిర్వహించేవాడు. దీనిద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఈ బెట్టింగ్‌లపై వాసు రూ.200 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది. ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగే వాసుకు రూ.కోటి విలువైన లగ్జరీ కార్లు నాలుగు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నాడు. ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు, ఇళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడలో చాలాసార్లు తన అనుచరులు పట్టుబడినా తన పలుకుబడిని ఉపయోగించి బయటకు తీసుకొచ్చేవాడు. ఈ వాసు బెంగళూరు రేవ్‌పార్టీలో తప్ప ఇప్పటివరకు ఎక్కడా పట్టుబడలేదు. లాక్‌డౌన్‌ సమీపంలో క్రికెట్‌ ఆడుతుండగా కాలికి తీవ్రగాయాలయ్యాయి. ఇటీవలి వరకు చేతికర్ర సాయంతోనే నడిచేవాడు. కిడ్నీస్‌ కూడా దెబ్బతిన్నాయి. హార్ట్‌ ప్రాబ్లమ్‌ రావడంతో స్టంట్‌ వేసినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Macharla Incident: మాచర్ల ఘటనలపై సజ్జల సందేహాలు.. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలని ఈసీకి డిమాండ్!

బర్త్‌ డే పార్టీ పేరుతో రేవ్‌పార్టీ..
ఇక ఈ నెల 18న సాయంత్రం బెంగళూరు శివారులో బర్త్‌ డే పార్టీ పేరుతో రేవ్‌పార్టీ ఏర్పాటుచేశాడు. ఈ పార్టీకి దాదాపు 250మంది వరకు హాజరైనట్ల తేలింది. ఇప్పటివరకు 101మందిని గుర్తించగా.. పరారైన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్‌ వాడినట్టు తేలింది. పార్టీలో పట్టుబడిన వారి బ్లడ్‌ సేకరించి టెస్టుల కోసం పంపించారు. ఇక పార్టీలో ముగ్గురు డ్రగ్స్‌ పెడ్లర్స్‌ను అరెస్టు చేశారు. వాసుతో స్నేహం లేకుండా వారు పార్టీలోకి రావడం అసాధ్యమంటున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిరుపేద కుటుంబానికి చెందిన వాసు.. ఇంత త్వరగా కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో అర్థంకావడం లేదని చెబుతున్నారు స్థానికులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు