Bandi Sanjay: తెలంగాణ ప్రజలను నమ్మించి..మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే మాట తప్పుతున్నారని ఫైర్ అయ్యారు. మేనిఫెస్టోలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం అన్నారని గుర్తు చేశారు. ప్రతిహామీని నేరవేరుస్తామని ప్రకటించిన రేవంత్ మాట తప్పారన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ...ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ నియామకాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని..కానీ ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. మేనిఫెస్టో ఎన్నికల వరకే పవిత్ర గ్రంథమా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత చిత్తు కాగితామా అంటూ ప్రశ్నలు సంధించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ కు లోకసభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. కాగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతోందని బండి అన్నారు.