Assam Floods: వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తాజాగా ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు గోలాఘాట్ కు చెందిన వారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగడ్ చరైడియా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 62 కి చేరింది. 29 జిల్లాల్లో 21 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
వరద బాధిత మోరిగావ్ జిల్లాలో గవర్నర్ గులాబ్ చంద్ కటారియా (Gulab Chand Kataria) పర్యటించి భురగావ్ గ్రామంలో బాధిత ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుత వరద పరిస్థితిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు.
కాగా , గౌహతి మెట్రోపాలిటన్ రీజియన్ లోని మాలిగావ్ పాండు పోర్ట్, మందిర్ ఘాట్ మజులిలో వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరిస్థితిని సమీక్షించారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మేంట్ అథారిటీ ప్రకారం.. అస్సాంలోని 29 జిల్లాల్లో మొత్తం 21, 13, 204 మంది వరదల బారిన పడ్డారు. కాగా, 57, 081 హెక్టార్లలో పంట నీట మునిగింది.
ధుబ్రిలో 6, 48, 806 మంది నిరాశ్రయులైయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న కామ్రూప్ జిల్లాలో హెచ్చరిక జారీ అయ్యింది.