Article 370: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. సరిగ్గా ఇదే రోజున 2019 ఆగస్టు 5న మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370, 35(A)లను రద్దు చేస్తూ భారత పార్లమెంటులో నిర్ణయిం తీసుకుంది. అయితే ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
ఈ మేరకు 'మన దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టమైన ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇది జమ్మూ- కశ్మీర్- లడఖ్ పురోగతికి దొహదపడుతోంది. ఇక్కడి ప్రజల శ్రేయస్సుకోసం కొత్త శకానికి నాంది. మహిళల దృక్పథానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల స్పూర్తితో ఇది అమలు చేయబడిందని అర్థం. అర్టికల్ రద్దుతో అభివృద్ధి ఫలాలు అందుకోలేని మహిళలు, యువత, వెనుకబడిన, గిరిజన, అట్టడుగు వర్గాలకు భద్రత, గౌరవం, అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో దశాబ్దాలుగా J&Kని పీడిస్తున్న అవినీతిని అరికట్టేలా చేసింది. రాబోయే కాలంలో మా ప్రభుత్వం వారి కోసం పని చేస్తుందని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందని నేను J&K, లడఖ్ ప్రజలకు హామీ ఇస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు మోదీ.
ఇక ఈ సందర్భంగా కేంద్రం అప్రమత్తమైంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. లోయలో ఇటీవల ఉగ్రవాదులు చెలరేగిపోతున్న నేపథ్యంలో భద్రతా దళాలను కేంద్రం అలర్ట్ చేసింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసింది. అమర్‌నాథ్ యాత్ర వాహనాలపైనా ఇలాంటి ఆంక్షలే విధించింది. అలాగే, ఉగ్రదాడి ముప్పు నేపథ్యంలో బలగాలు ఒంటరిగా ఉండొద్దని కేంద్రం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణను 5 ఆగస్టు 2019న కేంద్రం రద్దు చేయడంతోపాటు జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.