Shiv Sena Leader Argument With Auto Driver : ఓ రాజకీయ నేత కుమారుడు కారుకు ఆటో అడ్డు వచ్చిన విషయంలో ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. అయితే అదే సమయంలో గుండె పోటు (Heart Attack) రావడంతో నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర (Maharashtra) లోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోరే (45) ఆదివారం తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు నవపూర్‌లోని రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వారి కారుకి ఓ ఆటో అడ్డుగా వచ్చింది. దీంతో మిలింద్ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటు వల్ల చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ అయిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. శివసేన థానే యూనిట్‌కు డిప్యూటీ చీఫ్‌గా మిలింద్ మోర్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వివరించాయి.